
సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే మరో 15 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 54కు చేరుకుంది. 15 కొత్తకేసుల్లో సూర్యాపేట పట్టణంలో 12, చివ్వెంల మండలం బీబీగూడెంలో మూడు ఉన్నాయి. ఈ నెల 2న తొలి కేసు మర్కజ్‌కు వెళ్లిన కుడకుడ వ్యక్తికి నమోదైంది. అతడి నుంచి వైరస్ వ్యాప్తి చెందుతూ వస్తున్నది. కుడకుడ వ్యక్తి నుంచి అపోలో ఫార్మసీలో పనిచేస్తున్న మరో వ్యక్తికి, అలాగే కూరగాయల మార్కెట్‌లో వ్యాపారం చేస్తున్న మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా ఇతని నుంచి భారీగా కేసులు నమోదవుతున్నాయి.
మొత్తం 54 పాజిటివ్ కేసుల్లో సూర్యాపేట 40, నాగారం మండలం వర్ధమానుకోటలో 6, తిరుమలగిరిలో 3, నేరేడుచర్లలో 1, ఆత్మకూర్.ఎస్ మండలం ఏపూరులో 1, చివ్వెలం మండలం బీబీగూడెంలో 3 ఉన్నాయి. గురువారం ఒక్కరోజే 16 పాజిటివ్ కేసులో రాగా శుక్రవారం మరో 15 కేసులు నమోదు కావడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పాజిటివ్ వ్యక్తులకు సంబంధి ప్రైమరీ కాంటాక్ట్ ఎవరెవరు ఉన్నారో గుర్తిస్తూ అధికారులు క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. జిల్లాలో పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో అధికార యంత్రాంగం గట్టి నిఘా ఏర్పాటు చేసి ఏ ఒక్కరినీ ఇండ్ల నుంచి బయటకు రాకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులతోపాటు సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయిస్తున్నారు.