రాష్ట్రంలో కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు
గచ్చిబౌలిలో 1,500 పడకల ఆస్పత్రి సిద్ధం
ఇంటి ఓనర్లు ఇబ్బంది పెడితే 100కు డయల్ చేయండి
స్విగ్గీ, జొమాటో సేవలకు అనుమతి లేదు
మే 5 నుంచి రైతులు ఎరువులు కొనుగోలు చేసుకోవాలి
కరోనాకు మందు లేదు – ప్రజలు ఇలాగే సహకరించాలి
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ రథసారధి , గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రాష్ట్ర ప్రజలకు పూర్తి భరోసా కల్పించారు. అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నారు . కరోనాపై ఇటీవల చాలా ప్రెస్ మీట్లతో ప్రజలకు ఎంతో ధైర్యాన్ని అందించిన ముఖ్యమంత్రి ఆదివారం నాడు ఒక కుటుంబ పెద్దగా మళ్ళీ ఆత్మీయ నిర్ణయాలు తీసుకోవడంపై హర్షం వ్యక్తం అవుతున్నది
రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సడలింపులు ఉండవని, మే 7 వరకూ తెలంగాణలో లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మే 5న మరోసారి పరిస్థితిని సమీక్షించి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఇవాళ కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘గతంలో ప్రకటించిన లాక్డౌన్ నిబంధనలు అలాగే కొనసాగుతాయి. ఈనెల 20 తర్వాత కూడా రాష్ట్రంలో ఎలాంటి సడలింపులు ఉండవు. కరోనా కేసుల విషయంలో మే 1 తర్వాత ఊరట కలిగే అవకాశం. కేంద్రం సడలింపులు ప్రకటించినప్పటికీ రాష్ట్రంలో సడలింపులు ఉండవు. రాష్ట్ర పరిస్థితులను బట్టి సడలింపుల విషయంలో నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం కూడా చెప్పింది. గతంలో ప్రకటించిన లాక్డౌన్ నిబంధనలు అలాగే కొనసాగుతాయి. లాక్డౌన్ ఎత్తివేసిన దేశాలు కూడా మళ్లీ పాటిస్తున్నాయి. 45 దేశాలు కంప్లీట్ లాక్డౌన్లో ఉన్నాయి. కంటైన్మెంట్ జోన్లలో ఇంకా కఠినంగా వ్యవహరిస్తామని’ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారని సీఎం వెల్లడించారు. తెలంగాణలో ఆదివారం సాయంత్రం వరకు మొత్తం 858 కరోనా పాజిటివ్ కేసులున్నట్లు సీఎం చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఇవాళ మంత్రిమండలి సమావేశం జరిగింది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘కరోనా సోకినవారి ఆరోగ్యం నిలకడగానే ఉంది. రాష్ట్రంలో 651 మంది ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 186 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి 10 రోజులు పడుతోంది. ఒక్క కరోనా కేసు కూడా లేకుండా తెలంగాణలో నాలుగు జిల్లాలు వరంగల్ రూరల్, యాదాద్రి, సిద్దిపేట, వనపర్తి ఉన్నాయి. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 8 రోజులకోసారి రెట్టింపు అవుతోందని’ సీఎం కేసీఆర్ వివరించారు.
గచ్చిబౌలిలో 1,500 పడకల ఆస్పత్రి సిద్ధం
14 అంతస్తుల గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను హెల్త్ డిపార్ట్మెంట్కు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను కరోనా ప్రత్యేక ఆస్పత్రిగా వాడుకుంటామని చెప్పారు. కరోనా సోకిన వారికి చికిత్స అందించేందుకు యుద్ధప్రాతిపదికన 1500 బెడ్లను సిద్ధం చేశామని సీఎం వివరించారు.
‘గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను టిమ్స్‌గా మార్చాం. రేపటి నుంచి కోవిడ్ ఆస్పత్రిగా పనిచేయబోతోంది. టిమ్స్ ఆస్పత్రిగా గచ్చిబౌలిలోని కోవిడ్ ఆస్పత్రి ఉపయోగించుకుంటాం. వైద్య సిబ్బంది అద్భుత సేవలు అందిస్తున్నారు. వైద్య సిబ్బంది,పారిశుధ్య సిబ్బందికి పదిశాతం ప్రోత్సాహం ఈ నెల కూడా ఇస్తామని’ సీఎం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఇవాళ మంత్రిమండలి సమావేశం జరిగింది. అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఇంటి ఓనర్లు ఇబ్బంది పెడితే 100కు డయల్ చేయండి
తెలంగాణలో మూడు నెలలపాటు ఇంటి అద్దెలు వసూలు చేయొద్దని ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ 3నెలల కిరాయి వడ్డీలేకుండా తర్వాత వాయిదాల వారీగా చెల్లించొచ్చని సీఎం చెప్పారు. కిరాయి కోసం ఓనర్లు ఇబ్బంది పెడితే డయల్ 100కు ఫిర్యాదు చేయండి అని సీఎం కేసీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఇవాళ కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘అద్దెకు ఉండేవాళ్లను మూడు నెలలపాటు ఇబ్బంది పెట్టొద్దని కోరుతున్నాం. అద్దెకు ఉండేవాళ్లను మూడు నెలలపాటు ఇబ్బంది పెట్టొద్దని కోరుతున్నాం. ప్రైవేట్ స్కూళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులు పెంచకూడదు. నెలవారీగా మాత్రమే ట్యూషన్ ఫీజులు వసూలు చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే విద్యాసంస్థల అనుమతులు రద్దు చేస్తాం. ట్యూషన్ ఫీజు కాకుండా ఎలాంటి ఫీజు వసూలు చేయడానికి వీల్లేదు. 2020-21 ఏడాదికి విద్యా సంస్థల్లో ఒక్క రూపాయి కూడా ఫీజులు పెంచకూడదు. ఫీజులు కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టకూడదు.ఫీజుల కోసం ఎవరైనా ఇబ్బందిపెడితే డయల్ 100కి ఫోన్ చేయండి. ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మే 30 వరకు ఆస్తిపన్ను చెల్లించొచ్చు. మే నెలలో కూడా ప్రతి తెల్ల రేషన్ కార్డుదారుడికి 12 కిలోల బియ్యం, కుటుంబానికి రూ.1500 చొప్పున నగదు సాయం అందిస్తామని’ సీఎం వివరించారు.
స్విగ్గీ, జొమాటో సేవలకు అనుమతి లేదు
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో సేవలకు తెలంగాణలో అనుమతి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రేపటి నుంచి మే 7 వరకు అన్ని ఫుడ్‌డెలివరీ సంస్థలకు అనుమతి ఉండదని పేర్కొన్నారు. ఇవాళ కేబినెట్ సమావేశం అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘ఈ 15 రోజులు బయటి పదార్థాలు(ఫుడ్) జోలికి వెళ్లకండి. ప్రాణం కంటే ఏదీ విలువైనది కాదు. ఎలాంటి పండగలైనా పరిమిత సంఖ్యలో ఇళ్లలోనే జరుపుకోవాలి. రంజాన్ మాసం అయినప్పటికీ ఎలాంటి సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదు. అన్ని మతాల్లో సామూహిక కార్యక్రమాలు, ప్రార్థనలకు అనుమతి లేదు. ఇప్పటి వరకు ప్రజలు మంచి సహకారం అందించారు. శానిటైజేషన్, పారిశుద్ధ్యం పనులు బాగా జరుగుతున్నాయి. గ్రామాల నుంచి పట్టణాల దాకా ఎవరికి వారు శక్తివంచన లేకుండా పని చేస్తున్నారని’ సీఎం చెప్పారు.
మే 5 నుంచి రైతులు ఎరువులు కొనుగోలు చేసుకోవాలి
దేశ చరిత్రలో తొలిసారి రైతులు పండించిన పంటలను ఒక్క తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాబోయే రోజుల్లో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత వస్తోందని అన్నారు. అనుకున్న దిశగా కాళేశ్వరం ప్రాజెక్టులు పరుగులు తీస్తోందని సీఎం చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఇవాళ కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘మే 5 నుంచి రైతులు ఎరువులు కొనుగోలు చేసుకోవాలి. ఎరువుల నిల్వ చేయడానికి ఫంక్షన్ హాళ్లను వినియోగించాలని కలెక్టర్లకు ఆదేశించాం. ఫంక్షన్ హాళ్లను తాత్కాలిక గోదాములుగా వాడుకోవాలి. జూన్‌లో రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆహార పరిశ్రమలను కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఎరువుల దుకాణాల వద్ద గుమికూడకుండా చర్యలు తీసుకోవాలి. అవసరమైన ఎరువులను మే నెలలోనే రైతులు కొనుగోలు చేసుకోవాలని’ సీఎం సూచించారు.
‘శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చరిత్రలో ఎప్పుడూ కాకతీయ కాల్వకు ఆరునెలలు నీరు ఇవ్వలేదు. తొలిసారి కాకతీయ కాల్వకు ఆరునెలల పాటు నీరు ఇచ్చాం. ఎలాంటి ప్రభుత్వ సాయం కావాలన్నా డయల్ 100కి సమాచారం ఇవ్వండి. తప్పకుండా మీ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. తక్కువ ధరకు అమ్ముకుని రైతులు నష్టపోకూడదు. శనగలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ధాన్యం సేకరణ చాలా విజయవంతంగా కొనసాగుతోంది. మనదేశంలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయొద్దని ప్రధాని నరేంద్ర మోదీకి సూచించానని’ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.