ఆంధ్రపదేశ్‌లో కొత్తగా మరో 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో కర్నూలు జిల్లాలో 10 గుంటూరులో 9, వైఎస్సార్ కడపలో 6, పశ్చిమ గోదావరిలో 4, అనంతపురంలో 3, కృష్ణాలో 3 చొప్పున పాజిటివ్ కేసులు వచ్చాయి. సోమవారం ఉ.9 గంటల నుంచి మంగళవారం ఉ.9 గంటల వరకు మొత్తం 5,022 శాంపిల్స్‌ని పరిశీలించగా 35 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర నోడల్ అధికారి మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 184 కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమై అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 757కు చేరుకుంది. ఇక చికిత్స పొందుతూ పూర్తిగా కోలుకుని మొత్తం 96 మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే.. వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో 639 మంది చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో కొత్తగా గుంటూరు జిల్లాలో కోవిడ్‌తో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 22కు చేరింది.