లాక్డౌన్ కొనసాగుతున్నందున విధులకు హాజరయ్యే ఉద్యోగులకు జారీచేసే పాస్‌లకు సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం మెమో జారీచేశారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాలకు అనుగుణంగా ఈ మార్గదర్శకాలను రూపొందించారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యాలయాల అధిపతులు వారి ఉద్యోగులకు నిర్ణీత ఫార్మట్‌లో పాస్‌లు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ప్రత్యేక ఫార్మట్‌ను కూడా ప్రభుత్వం విడుదలచేసింది.
- కంటైన్మెంట్ క్లస్టర్లకు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న బఫర్ జోన్లలోని ఉద్యోగులు విధులకు అనుమతించకూడదు.
- రొటేషన్ పద్ధతిన కనీస సిబ్బందిని విధులకు అనుమతించాలి.
- హైరిస్క్ ఉన్నవారిని (వయసు మళ్లినవారు, గర్భిణులు, అంతర్లీన వైద్య పరిస్థితులు (కొమొర్బిడిటీ) ఉన్నవారు) కార్యాలయాలకు పిలువకూడదు.
- కార్యాలయంలో ఉద్యోగి పనిచేసే తేదీలను పేర్కొంటూ పాస్‌లు జారీ చేయాలి.
- కార్యాలయాల్లోని అన్ని ప్రాంతాల్లో క్రిమి సంహారక మందులు పిచికారీ చేయాలి. అక్కడకొచ్చే వాహనాలకూ క్రిమి సంహారక మందులను స్ప్రే చేయాలి.
- బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాల్లో ఫేస్‌మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి. అధికారులు, ఉద్యోగులకు మాస్క్‌లు అందించాలి.
- కార్యాలయానికి వచ్చి, వెళ్లేవారిని విధిగా థర్మల్ స్క్రీనింగ్ చేయాలి.
కార్యాలయంలో పాటించాల్సినవి
- కార్యాలయాన్ని తరుచుగా శుభ్రం చేసుకోవాలి.
- తుమ్మినప్పుడుకానీ, దగ్గినప్పుడుకానీ ముక్కు, మూతి కప్పివుంచాలి.
- వ్యక్తిగత పరిశుభ్రత, నిర్ణీత దూరం పాటించాలి.
- ఇన్ఫెక్షన్లు సోకకుండా క్రిమి సంహారక మందులు చల్లాలి.
- కుర్చీల ఏర్పాటు ఆరు అడుగుల దూరంలో ఉండేలా చూడాలి.
- కార్యాలయలోని ఏ ప్రదేశంలోనైనా ఐదు, అంత కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలి.
- సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే చేపట్టాలి.
- ఇతర కార్యాలయాలకు పంపాల్సిన ఫైళ్లను నేరుగా తీసుకెళ్లి ఇవ్వకుండా ఈ-మెయిల్ ద్వారానే పంపాలి.
- ఉద్యోగులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొంటూ.. జ్వరం, దగ్గు, నీరసం, శ్వాసకోశ సమస్య వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పైఅధికారులకు తెలియజేసి కార్యాలయాన్ని వదలి వెళ్లిపోవాలి.
- ఇలాంటి సమస్యలు ఎదురైనావారిని వెంటనే గృహ నిర్బంధానికి పంపాలి.
- హోం క్వారంటైన్‌కు సెలవు అడిగిన సిబ్బందికి పైఅధికారులు వెంటనే సెలవు మంజూరుచేయాలి.
- హైరిస్క్ ఉద్యోగులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.