ఏపీలో మొత్తం ఆరు జిల్లాల్లో మంగళవారం ఒక్క కేసు కూడా కొత్తగా నమోదు కాలేదు. అవి.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒకొక్కటి చొప్పున నమోదయ్యాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల కేంద్రంగానే వైరస్ పెరుగుతోంది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు కూడా పూర్తిగా రెడ్జోన్లకే పరిమితమయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఇక మంగళవారం నమోదైన పాజిటివ్ కేసుల్లో 85.3 శాతం కూడా ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నాయి. ఒక్క కర్నూలు జిల్లాలోనే గడిచిన 24 గంటల్లో మొత్తం 6,908 టెస్టులు చేయగా 40 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల్లో 26.37 శాతం ఈ జిల్లాలోనే ఉన్నాయి.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇలా..
► మొత్తం రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కేసులు తీసుకుంటే కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే 64.25 శాతం ఉన్నాయి.
► ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 80,334 టెస్టులు చేయగా అందులో 22,179 టెస్టులు ఈ మూడు జిల్లాల్లోనే చేశారు.
► మొత్తం ఈ మూడు జిల్లాల్లో చేసిన టెస్టుల శాతం 27.6.
► రాష్ట్రంలో నెగిటివ్ వచ్చిన శాతం 98.43గా ఉంది.
► ఇక మంగళవారం నమోదైన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల శాతం 1.57.
► ఇప్పటివరకూ రాష్ట్రంలో అత్యధిక పాజిటివ్ కేసులు కర్నూలులో 332 నమోదు కాగా.. పాజిటివ్ నుంచి కోలుకుని రికవరీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాగా విశాఖ నిలిచింది. విశాఖ జిల్లాలో 22 మందికి పాజిటివ్ రాగా 19 మంది పూర్తిగా కోలుకున్నారు. అంటే రికవరీ శాతం 86.36.
► విజయనగరం జిల్లాలో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ జిల్లాలోని మండలాలన్నీ గ్రీన్జోన్లో ఉన్నాయి.
104కి కాల్ చేయండి
జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఉచిత కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య సలహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 104కి ఫోన్ చేసి అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. స్వీయ గృహ నిర్బంధాన్ని పాటిస్తే ప్రభుత్వం క్వారంటైన్‌కు పంపదని చెప్పారు.