తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7 కొత్తగా కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏడు కరోనా కేసులు నమోదుకాగా, 35 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. బుధవారం నమోదైన కేసులన్నీ జిహెచ్‌ఎంసి పరిధిలోనివి కావడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1016కి చేరగా, 409 మంది వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు ప్రకటించారు. ప్రస్తుతం కరోనా ప్రత్యేక ఆసుపత్రుల్లో 582 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. వీరందరికి పూర్తిస్థాయిలో వైద్యం అందిస్తున్నామని, ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు డా శ్రీనివాసరావు తెలిపారు.

అయితే బుధవారం డిశ్చార్జ్ అయిన వారిలో 14 మంది చిన్నారులుండగా, వీరిలో ఇరవై మూడు రోజుల బాలుడు కూడా కోలుకోవడం అద్భుతమని అధికారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. దేశంలోనే మొట్టి మొదటి సారిగా అతి చిన్న వయస్సులో ఈ చిన్నారి కరోనాని జయించినట్లుగా అధికారులు తెలిపారు. మహాబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఈ బాలుడికి, వారి తల్లిదండ్రుల నుంచి వైరస్ సోకిందని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, 104 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి కోవిడ్‌పై పూర్తిస్థాయి సమాచారాన్ని తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అదే విధంగా మానసిక సమస్యలతో బాధపడే వారు 108కి కాల్ చేసి వైద్యనిపుణులు సలహాలు తెలుసుకోవచ్చని వెల్లడించారు.

కోవిడ్‌పై ప్రత్యేక అధికారుల నియామకం
రాష్ట్రంలో అతి ముఖ్యమైన వ్యక్తులకు కరోనా సోకితే, వారిని పూర్తిస్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఇద్దరు ఉన్నతాధికారులను నియమించింది. ఈమేరకు బుధవారం సిఎస్ సోమేష్‌కుమార్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా, ఐపిఎస్ అధికారి జితేందర్‌లు కరోనా సోకిన ప్రత్యేక వ్యక్తులకు(విఐపి) నోడల్ అధికారులుగా కొనసాగుతారని సిఎస్ తెలిపారు. ఇదిలా ఉండగా కేంద్ర బృందం తమ పర్యటనలో భాగంగా బుధవారం చెస్ట్ ఆసుపత్రిని సందర్శించింది. అక్కడ కరోనా అనుమానితులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెస్ట్ ఆసుపత్రిలో పాజిటివ్ కేసుల జీరో కావడంతో కేంద్ర బృందం వైద్యాధికారులను ప్రశంసించింది.