ఏపీ రాజ్‌భ‌వ‌న్‌లో మ‌రో ఇద్ద‌రికి క‌రోనా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో‌ కరోనా కేసులు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి.  మొత్తం కేసుల సంఖ్య 1300 దాటింది. తాజాగా ఏపీ రాజ్‌భవన్‌లో మరో ఇద్దరు కరోనా బారిన పడ్డట్లు తెలుస్తోంది. రాజ్‌భ‌వ‌న్‌కు చెందిన న‌లుగురికి ఇప్ప‌టికే వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధార‌ణ  కాగా, ఇప్పుడు మ‌రో ఇద్ద‌రికి క‌రోనా  సోకిన‌ట్లు తెలుస్తోంది. ఒక్కొక్క‌టిగా పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతుండ‌టంతో అధికారుల్లో ఆందోళ‌న‌ నెల‌కొంది. అక్కడ పనిచేసే ఉద్యోగితో పాటు, 108 అంబులెన్స్‌ డ్రైవరుకు కూడా వైరస్‌ సోకినట్లు తేలింది. ఇంతకుముందు గవర్నర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, స్టాఫ్‌ నర్స్‌, ఇద్దరు అటెండర్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో వారి కుటుంబ స‌భ్యుల‌ను కూడా క్వారంటైన్‌కు త‌ర‌లించారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.