దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ మరో 2 వారాల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మే 4వ తేదీ నుంచి రెండు వారాల పాటు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. ఈ మేరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెండో దఫా లాక్‌డౌన్ గడువు మే 3తో ముగియనుంది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ.. లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది.ఇక శనివారం ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. కరోనా కట్టడి కొనసాగింపు చర్యలపై మోదీ స్పష్టత ఇవ్వనున్నారు.
దేశ వ్యాప్తంగా విమానాలు, రైళ్లు, మెట్రో సర్వీసులు, అంతర్ రాష్ర్టాల మధ్య రాకపోకలు, పాఠశాలలు, కళాశాలలతో పాటు శిక్షణ, కోచింగ్ సంస్థలపై నిషేధం విధించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ ఫూల్స్, స్టేడియంలను మూసి ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని ప్రార్థనాస్థలాలు, పబ్లిక్ ఈవెంట్లను రద్దు చేశారు. అన్ని జోన్లలోని ఆస్పత్రుల్లో ఓపీ సేవలకు అనుమతి ఇచ్చారు.
రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. సైకిళ్లు, రిక్షాలు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్‌లు, బస్సులు, కటింగ్ షాపులపై నిషేధం విధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని ఆంక్షలు సడలింపు ఇచ్చారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. వారానికి ఒకసారి రెడ్ జోన్లలో పరిస్థితిని పరిశీలించనున్నారు. కేసులు తగ్గితే రెడ్ జోన్లను గ్రీన్ జోన్లగా మార్చనున్నారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. గ్రీన్ జోన్లలో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరెంజ్ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి ఇచ్చారు. కార్లలో ఇద్దరికి, టూ వీలర్‌పై ఒక్కరికి మాత్రమే అనుమతి ఇచ్చారు.