తెలంగాణలో కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. శుక్రవారం నమోదైన 6 కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,044కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న 24 మంది బాధితులు ఇవాళ డిశ్చార్జి అయ్యారు. 

లాక్‌డౌన్‌ను తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా అమలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించడం వల్లే లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ పిలుపుతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌కు సహకరించారు. కరోనా టెస్టులు చేయకపోవడం వల్లే తక్కువ కేసులనే ఆరోపణలు నిజం కాదని మంత్రి స్పష్టం చేశారు. ఎక్కడ పడితే అక్కడ టెస్టులు చేయవద్దని ఐసీఎంఆర్‌ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏదైనా ఇంట్లో కరోనా పాజిటివ్‌ వస్తేనే పరీక్షలు చేయాలని చెప్పిందన్నారు. కరోనా లక్షణాలు ఉంటేనే ఆస్పత్రిలో చికిత్స చేయాలని ఐసీఎంఆర్‌ చెప్పిందని మంత్రి తెలిపారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్‌ అందరినీ అప్రమత్తం చేశారని మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.