తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ వారిలో పురుషులే అధికంగా ఉన్నారు. తెలంగాణలో నమోదైన కేసుల్లో 66.5 శాతం(705 మంది) పురుషులు ఉండగా, 33.5 శాతం(356 మంది ) స్త్రీలు ఉన్నారని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దీనిలో 21 నుంచి 30 మధ్య గల వయస్సు వారిలోనే ఎక్కువగా వైరస్ సోకడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 0..5 ఏళ్ల వారు 5 శాతం ఉండగా, 6 నుంచి 10 సంవత్సరాల వాళ్లు 4 శాతం, 11 నుంచి 20 ఏళ్ల వారు 13 శాతం, 21 నుంచి 30 ఏళ్ల వారు 21 శాతం, 31 నుంచి 40 ఏళ్ల వారు 19 శాతం, 41 నుంచి 50 శాతం వారు 15 శాతం, 51 నుంచి 60 ఏళ్ల వారు 14 శాతం, 61 నుంచి 70 ఏళ్ల వారిలో 7 శాతం, 71 నుంచి 80 ఏళ్ల వారిలో 2 శాతంగా వైరస్ సోకినట్లు బులిటెన్‌లో వెల్లడించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కొత్తగా 17 కేసులు నమోదు కాగా, ఒకరి మృతి చెందారని వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.
కొత్తగా నమోదైన కేసుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో 15 ఉండగా, రంగారెడ్డి జిల్లాలో మరో రెండు నమోదయ్యాయి. అయితే వైరస్ బారి నుంచి పూర్తిస్థాయిలో కోలుకొని శనివారం మరో 35 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య1061కి చేరగా, ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 499కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 533 ఉండగా, కరోనా మరణాలు 29కి పెరిగాయి.
హైదరాబాద్‌లో 19 కంటెన్మెంట్లు ఎత్తివేత….
రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే 14 రోజులుగా కేసులు నమోదు కానీ ప్రాంతాల్లో అధికారులు కంటైన్‌మెంట్లను ఎత్తివేస్తున్నారు. ఈక్రమంలో శనివారం మరో 19 కంటైన్‌మెంట్లను ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గత వారం రోజులుగా ఆయా ప్రాంతాల్లో కేసులు నమోదు కాలేదని, దీనిలో భాగంగానే తొలగించినట్లు అధికారులు తెలిపారు.