విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి సానుభూతి ప్రకటించారు. అందరి క్షేమం కోరుతూ, బాధితులు త్వరగా కోలుకోవాలని పేర్కొంటూ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు.
చాలా బాధగా ఉంది..
విశాఖ గ్యాస్ లీక్ విషాదం గురించి వినడం చాలా బాధగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో అందరి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. హెల్త్ ప్రొటోకాల్‌ను పాటిస్తూ అధికార యంత్రంగాతో కలిసి పార్టీ కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు.
800 మందికి పైగా ఆస్పత్రికి తరలింపు..
విష వాయువు ప్రభావం కారణంగా గొంతు, చర్మ సంబంధ సమస్యలతో స్థానికులు బాధపడ్డారు. దీంతో పోలీసులు, అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలకు ఉపక్రమించారు. 1000 నుంచి 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 800 మందికిపైగా ఆస్పత్రికి తరలించారని ఎన్‌డీఆర్‌ఎఫ్ డీజీ ఎస్‌ఎన్ ప్రధాన్ తెలిపారు.