- కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాం
- నిబంధనల ప్రకారమే నిర్ధారణ పరీక్షలు
- వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్తగా కరోనా కేసులు నమోదుకాని మరో 14 జిల్లాలను గ్రీన్‌జోన్లుగా నిర్ధారించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారు చికిత్స అనంతరం కోలుకొని డిశ్చార్జి అవుతున్నారని చెప్పారు. శుక్రవారం కోఠి కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు రాష్ట్రంలో 9 జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయన్నారు. కొత్తగా మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, నారాయణపేట, వికారాబాద్, నల్లగొండ, జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, జనగాం జిల్లాలను గ్రీన్‌జోన్‌లో చేర్చాలని కోరామని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర వైద్యవాఖ మంత్రి హర్షవర్ధన్ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కూడా దీనిపై చర్చించినట్టు స్పష్టంచేశారు. ఈ ప్రతిపాదనను పరిశీలించి సోమవారం ప్రకటిస్తామని కేంద్రమంత్రి చెప్పారని తెలిపారు. రెడ్‌జోన్‌లోని సూర్యాపేట, వరంగల్ అర్బన్, వికారాబాద్ జిల్లాల్లో కొత్తగా పాజిటివ్ కేసులు నమోదుకావడం లేదని, ఆ జిల్లాలను ఆరెంజ్‌జోన్‌గా నిర్ధారించాలని కేంద్రాన్ని కోరినట్టు వివరించారు. రెడ్‌జోన్‌లోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా ఇక ముందు కరోనా కేసులు తగ్గుతాయని ఆశిస్తున్నామన్నారు. కేంద్రమంత్రితో వీడియో కాన్ఫరెన్సులో వైరస్ నిర్ధారణ పరీక్షల మార్గదర్శకాలపై చర్చించామని తెలిపారు. పాజిటివ్ కేసులు నమోదైనవారి ఇండ్లల్లో కిడ్నీ, గుండె, లివర్, క్యాన్సర్ రోగులు లేదా 70 ఏండ్లకుపైబడి బీపీ, షుగర్‌తో బాధపడే వాళ్లను టెస్ట్ చేయాలని, ఆ ఇండ్లల్లో గర్భిణులుంటే ప్రసవానికి ముందు పరీక్షలు చేయాలన్న విధానాలు కొనసాగిస్తున్నామని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్టు ఈటల చెప్పారు. కొందరు ఉద్దేశపూర్వకంగా నిర్ధారణ పరీక్షలు చేయడం లేదని విమర్శించడం తగదన్నారు.
80% ప్రాంతాల్లో పనులు చేసుకోవచ్చు
కేంద్రం 14 జిల్లాలను గ్రీన్‌జోన్‌గా నిర్ధారిస్తే రాష్ట్రంలోని 80శాతం ప్రాంతాల్లో అన్ని పనులు చేసుకోవచ్చని మంత్రి ఈటల తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని లింక్ రూట్లలో బస్సులు తిరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం మాస్ ట్రాన్స్‌పోర్ట్ మినహాయిస్తే ఆయా ప్రాంతాల్లో ఆటోలు, మినీ వాహనాలు, షాపులు కొనసాగించుకోవచ్చని చెప్పారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆరోగ్య, మున్సిపల్, రెవెన్యూ, పోలీసుశాఖలు మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. విదేశాల నుంచి, ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్నవారికి స్క్రీనింగ్ పరీక్షలుచేసి, వైరస్ లక్షణాలు లేకున్నా క్వారంటైన్‌లో ఉండేలా చూస్తామన్నారు. ఆశవర్కర్ల నుంచి గాంధీ, ఉస్మానియా వరకు అన్నిచోట్ల వైద్యసేవలు కొనసాగుతాయని, ప్రైవేటు దవాఖానల్లో సేవలు నిలిపివేయాలని తాము చెప్పలేదని వివరించారు. గాంధీ దవాఖానలో కరోనా బాధితురాలికి విజయవంతంగా ప్రసవం చేసిన వైద్యులను మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేకంగా అభినందించారు.
మంత్రికి పీపీఈ కిట్లు అందజేసిన కేఎంసీ పూర్వ విద్యార్థులు
కాకతీయ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు శుక్రవారం కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ డీ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో మంత్రి ఈటల రాజేందర్‌ను బీఆర్‌కే భవన్‌లో కలిసి రూ.8లక్షల విలువైన వివిధ వైద్య పరికరాలు, పీపీఈ కిట్లను అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో 1986 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థులు ప్రవీణ్‌కుమార్‌తోపాటు అమెరికాలో స్థిరపడిన అజిత్ చల్లా, వినోద్, పరంజిత్ సింగ్, విశాల్, వేణురెడ్డి, శ్రీనివాసన్, రాజేశ్‌కుమార్ ఉన్నారు.
కొత్తగా 10మందికి పాజిటివ్
రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. 34 మంది డిశ్చార్జి అయ్యారు. కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,132కు చేరింది. వీరిలో 29 మంది మృతిచెందగా, 727 మంది కోలుకొని ఇండ్లకు చేరారు. ప్రస్తుతం 376 మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదలచేసింది. 75 ఏండ్ల వృద్ధుడితోపాటు ఇతర అనారోగ్య సమస్యలున్నవారు పలువురు సైతం చికిత్స అనంతరం వైరస్ నెగెటివ్ రావడంతో శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం 54 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,887కు చేరింది.