అమెరికా పెద్దల కరోనా భద్రతపై ఆందోళన కలిగించే అంశమిది. ఇటీవలే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయకునికి కరోనా పాజిటివ్ రావడం సంచలనం కలిగించింది. ఎందుకంటే అతడు పనిచేసేది వైట్‌హౌస్‌లో. ఇక అద్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ రోజువారీగా వైట్ హౌస్ లో సమావేశం అవుతూనే ఉంటారు. పెన్స్ పత్రికా కార్యదర్శి కేటీ మిల్లర్‌కు తాజాగా పాజిటివ్ రావడం అధికారులకు బెదురు పుట్టిస్తున్నది. ఇంకో విషయం ఏమిటంటే కేటీ భర్త స్టీఫెన్ మిల్లర్ అధ్యక్షునికి వలస వ్యవహారాల సలహాదారుగా పనిచేస్తున్నారు. ఈ వలయంలోనే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు పనిచేస్తున్నారు. కేటీకి పాజిటివ్ రావడం గురించి శుక్రవారం రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుల సమావేశంలో ట్రంప్ వెల్లడించారు. ‘చాలాకాలం నుంచి పరీక్షలు జరుపుతున్నా కేటీకి ఏమీ బయటపడలేదు. ఇప్పుడు హటాత్తుగా పాజిటివ్ వచ్చింది’ అని ఆయన వివరించారు. ‘పెన్స్‌ను కేటీ అధికారికమైన పనుల మీద తరచూ కలుసుకుంటుంది. అందుకే ఆయనకు పరీక్షలు జరిపిస్తే నెగెటివ్ వచ్చింది’ అని ట్రంప్ తెలిపారు. ట్రంప్‌కు, పెన్స్‌కు తగిన భద్రత కల్పిస్తున్నామని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కేలీ మెక్ఎనానీ చెప్పారు. కరోనా టాస్క్‌ఫోర్స్‌లోని డాక్టర్ బిర్క్స్, డాక్టర్ ఫాసీ సూచనలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నామని మీడియా సమావేశంలో స్పష్టం చేసారు.
