రూ. 20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన మోదీ

కరోనా నుంచి రక్షించుకోవాలి.. అదే సమయంలో ముందుకు సాగాలి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లాక్‌డౌన్‌ సడలింపులు, కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రసంగించారు. ఈ నెల 17తో లాక్‌డౌన్‌ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో మోదీ ప్రసంగానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ వైరస్‌ నుంచి మనం మనల్ని కాపాడుకుంటూనే ముందుకు సాగాలని మోదీ పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదని మోదీ స్పష్టం చేశారు. కరోనాకు ముందుకు కరోనా తర్వాత విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 3 లక్షలకు పైగా మంది మరణించారు. నాలుగు నెలలుగా కరోనాతో పోరాడుతున్నామని మోదీ తెలిపారు. కరోనాతో పోరాడుతూనే జీవనం కొనసాగించాలని ప్రజలకు ప్రధాని సూచించారు. 

కరోనా ఆపదను ఎదుర్కొనేందుకు జాతి మొత్తం ఒక్కటై నిలబడింది. కరోనా మనకు ఆపదతో పాటు అవకాశాన్ని తెచ్చిపెట్టింది. కరోనా తెచ్చిన ఆపదలను అవకాశాలుగా మలుచుకుంటున్నాం. కరోనాకు ముందు దేశంలో ఒక్క పీపీఈ కిట్టు కూడా తయారు కాలేదన్నారు. దేశంలో ఎన్ -95 మాస్కులు కూడా నామమాత్రంగా తయారయ్యేవి. ఇప్పుడు పీపీఈ కిట్లు, మాస్కుల తయారీలో స్వయం సమృద్ధి సాధించామన్నారు. మన దగ్గర తయారయ్యే వస్తువు ప్రపంచానికి కూడా ఇవ్వాలనేది మన దృక్పథం అని మోదీ అన్నారు

ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పేరుతో రూ. 20 లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని మోదీ ప్రకటించారు. రేపట్నుంచి ఆత్మ నిర్భర్‌ అభియాన్‌పై ఆర్థిక మంత్రి వివరాలు అందిస్తారని తెలిపారు. కొవిడ్ -19 కోసం ప్రభుత్వం చేసిన ప్రకటనలతో పాటు, ఆర్బీఐ నిర్ణయాలు అన్నీ కలుపుకుని ఆ ప్యాకేజీ విలువ సుమారు రూ. 20 లక్షల కోట్లు ఉంటుందన్నారు. మన దేశ జీడీపీలో ఈ ప్యాకేజీ 10 శాతమని మోదీ చెప్పారు. లాక్‌డౌన్‌ సడలింపులు, కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రసంగించారు. ఈ నెల 17తో లాక్‌డౌన్‌ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో మోదీ ప్రసంగానికి ప్రాధాన్యత సంతరించుకుంది.  

భారత్‌ సర్కార్‌ నుంచి వెళ్లే ప్రతి రూపాయి ప్రతి శ్రామికుడి, రైతు జేబులోకి నేరుగా వెళ్తుందన్నారు. ఈ ప్యాకేజీ ద్వారా కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలకు అనేక అవకాశాలు లభిస్తాయన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఊతం వస్తుందన్నారు. దేశంలోని ప్రతి పారిశ్రామికుడిని కలుపుకునిపోయేలా ప్యాకేజీ ఉంటుందని మోదీ పేర్కొన్నారు. భారత పారిశ్రామిక రంగానికి మరింత బలాన్ని చేకూర్చేందుకు ఈ ప్యాకేజీ ఉపయోగకరంగా ఉంటుందని మోదీ అన్నారు. 

సంఘటిత, అసంఘటిత రంగంలోని ప్రతి వ్యక్తిని ఆర్థిక ప్యాకేజీ కాపాడుతుందన్నారు. జన్ ధన్ అభియాన్ తో మనం ఒక విప్లవాన్ని చూశామన్నారు. ఇప్పుడు మరో కొత్త విప్లవానికి నాంది పలుకబోతున్నామని మోదీ చెప్పారు. భవిష్యత్ లో వ్యవసాయంపై ఎలాంటి ప్రభావం పడకుండా ఏర్పాట్లు ఉంటాయన్నారు. స్థానిక మార్కెట్లను విస్తరించాల్సిన అవసరాన్ని ఈ సంకట స్థితి తెచ్చింది. బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణకు ఆలంబనగా నిలుస్తుందన్నారు. గ్లోబల్ డిమాండ్ తో పాటు, స్థానిక డిమాండ్ ను సృష్టించాలి అని మోదీ అన్నారు.

కొత్త రూపంలో నాలుగో దశ లాక్‌డౌన్‌ : ప్రధాని మోదీ

దేశంలో నాలుగోసారి లాక్‌డౌన్‌ విధించబోతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. నాలుగో దఫా లాక్‌డౌన్‌ వివరాలు ఈ నెల 18 లోపు వెల్లడిస్తామని మోదీ చెప్పారు. నాలుగో దశ లాక్‌డౌన్‌ కొత్త రూపంలో ఉంటుందన్నారు. లాక్‌డౌన్‌ సడలింపులు, కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మంగళవారం రాత్రి మాట్లాడారు. ఈ నెల 17తో మూడో దశ లాక్‌డౌన్‌ గడువు ముగియనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి దేశంలో నాలుగోసారి లాక్‌డౌన్‌ విధించబోతున్నట్లు మోదీ ప్రకటన చేశారు. 

కరోనా వైరస్‌ మన జీవితంలో ఒక భాగమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ మన జీవితాలను కరోనా వైరస్‌ చుట్టూ పరిమితం కానివ్వలేము అని మోదీ అన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రతి ఒక్కరం మాస్కులు కట్టుకుందాం.. ఆరు అడుగుల దూరం పాటిద్దామని మోదీ పిలుపునిచ్చారు. ఈ విధంగా చేస్తే కరోనాను సాధ్యమైనంత వరకు అరికట్టవచ్చు అని మోదీ తెలిపారు. 

లోక‌ల్ బ్రాండ్లే.. జీవ‌న‌ మంత్రం కావాలి

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో విధించిన లాక్‌డౌన్ వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ స్తంభించిపోయింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ ప్ర‌ధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ.. 20 ల‌క్ష‌ల కోట్ల భారీ ప్యాకేజీని ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న ప్ర‌సంగంలో లోక‌ల్ బ్రాండ్ల‌కు విశేష ప్ర‌జాద‌ర‌ణ క‌ల్పించాల‌న్నారు.  ఇది మ‌న ఉత్ప‌త్తి అన్న భావ‌న క‌లిగేలా చేయాల‌న్నారు.  స్థానిక ఉత్ప‌త్తుల అమ్మ‌కాలు పెరిగితే, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతం అవుతుంద‌న్న ఉద్దేశంతో మోదీ ఈ వ్యాఖ్య‌లు చేశారు.  చేనేత‌, ఖాదీ వ‌స్త్రాల‌కు ఇప్పుడు ఉన్న డిమాండ్‌ను కూడా ఆయ‌న గుర్తు చేశారు. లోక‌ల్ బ్రాండ్ల‌నే జీవ‌న మంత్రంగా చేసుకోవాల‌న్నారు.  ఇప్పుడు గ్లోబ‌ల్ బ్రాండ్లుగా పేరుగాంచిన వ‌స్తువుల‌న్నీ.. ఒక‌ప్పుడు లోక‌ల్ మాత్ర‌మే అన్నారు. అయితే ఎప్పుడైతే ప్ర‌జలు వాటికి మ‌ద్ద‌తు ఇస్తారో అప్పుడే ఆ బ్రాండ్లు గ్లోబ‌ల్‌గా మారుతాయ‌న్నారు. అందుకే నేటి నుంచి ప్ర‌తి భార‌తీయుడు లోక‌ల్ బ్రాండ్ల‌కు.. స్వ‌రంగా మారాల‌న్నారు. గ‌తంలో లోక‌ల్ బ్రాండ్లే మ‌న‌ల్ని ర‌క్షించాయ‌న్నారు.  అవి అవ‌స‌ర‌మే కాదు, వాటిని వాట‌డం కూడా మ‌న బాధ్య‌త అన్నారు.