వలస కార్మికుల కోసం రాష్ర్టాలకు అదనపు ఆహార పదార్థాలు పంపేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) సిద్ధంగా ఉందని ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. ఒక్కో వలస కూలీకి ఐదు కిలోల బియ్యం, కేజీ పప్పును అందిచనున్నట్లు తెలిపారు. ఉచితంగానే రెండు నెలల(మే, జూన్) పాటు అందజేయనున్నట్లు చెప్పారు. వలస కూలీలు నేషనల్ ఫుడ్ సెక్యురిటీ యాక్ట్ కింద కవర్ కావడం లేదు. లాక్‌డౌన్ నేపథ్యంలో రేషన్ కార్డు లేకుండా రాష్ర్టాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు ఈ స్కీమ్ కింద అర్హులన్నారు. దాదాపు 8 కోట్ల మంది ఈ పథకం కింద అర్హులు కానున్నట్లు తెలిపారు. కేంద్రమే రూ. 3,500 ను ఖర్చు చేసి 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 50 వేల మెట్రిక్ టన్నుల పప్పును వలస కూలీల నిమిత్తం అందిస్తున్నట్లు తెలిపారు
