కరోనా పట్ల ప్రజల్లో ఉన్న తీవ్ర భయాందోళనలను పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ సీఎం జగన్ అన్నారు. భయాందోళన తగ్గాలంటే ఏం చేయాలన్నదానిపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. వైరస్ సోకిన వారిపట్ల వివక్ష చూపడం మానుకోవాలన్నారు. కోవిడ్–19 నివారణ చర్యలు, లాక్డౌన్ తదితర అంశాలపై శనివారం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
‘భవిష్యత్లో విలేజ్ క్లీనిక్స్ స్థాయికి కోవిడ్ పరీక్షలు జరగాలి. భౌతికదూరం పాటించేలా దుకాణదారులే ముందుకొచ్చే పరిస్థితి తీసుకురావాలి. వ్యవసాయ రంగంలో రైతుభరోసా కేంద్రాలు కీలకపాత్ర పోషించనున్నాయి. మార్కెట్ ఇంటెలిజెన్స్ విధానం, మార్కెట్ ఇంటర్వెర్షన్ విధానం చాలా ముఖ్యమైనవి. ఈ రెండు విషయాల్లో సమర్థవంతంగా రైతు భరోసా కేంద్రాలు పనిచేయాలి. లోపాలు లేకుండా సమర్ధ యంత్రంగాన్ని ఏర్పాటు చేయాలని’ జగన్ పేర్కొన్నారు.