వైద్య సదుపాయల ఏర్పాటుకు రూ. 15 వేల కోట్లు – కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌

కోవిడ్‌-19 నేపథ్యంలో దేశవ్యాప్త వైద్య సదుపాయాల ఏర్పాటుకు ఇప్పటికే రూ. 15 వేల కోట్లు ప్రకటించినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ-5 వివరాలను ఆమె నేడు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… వైద్య సదుపాయాల కోసం రూ.4,113 కోట్లు రాష్ర్టాలకు అందించినట్లు తెలిపారు. అదేవిధంగా టెస్టు కిట్లు, తదితర అవసరమైన వస్తువుల కోసం రూ. 3,750 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. టెస్టింగ్‌ ల్యాబ్‌లు, కిట్స్‌ల కోసం మరో రూ. 550 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కరోనా సమయంలోనే 300 కు పైగా పీపీఈ కిట్ల తయారీ పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయన్నారు. ఆరోగ్యరంగంలో పనిచేసే సిబ్బందికి రూ. 50 లక్షల చొప్పున బీమా కల్పించామన్నారు. కేంద్రం నుంచి రాష్ర్టాలకు 51 లక్షల పీపీఈ కిట్లు, 87 లక్షల ఎన్‌-95 మాస్కులు, 11 కోట్లకు పైగా హైడ్రో క్లోరోక్విన్‌ మాత్రలను సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో సాంక్రమిక వ్యాధుల ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య సంక్షోభం ఎదుర్కొనేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో వైద్య సదుపాయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి పరచడం. ల్యాబ్‌ నెట్‌వర్క్స్‌ను పటిష్ట పరచడం కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోవిడ్‌ అనుభవాల నేపథ్యంలో భవిష్యత్‌లోనూ సంక్షోభాలు ఎదుర్కొనేందుకు భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వైద్య పరిశోధనల కోసం ఐసీఎంఆర్‌ ద్వారా అదనపు నిధులు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

స్కూల్‌ విద్యార్థుల కోసం స్వ‌యంప్ర‌భ ఛాన‌ళ్లు..

కోవిడ్‌19 మ‌హ‌మ్మారి వ‌ల్ల విద్యార్థుల చ‌దువులు దెబ్బ‌తిన‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు.  విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది ప‌డ‌వ‌ద్దు అన్న ఉద్దేశంతో స్వ‌యంప్ర‌భ డీటీహెచ్ ఛాన‌ళ్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. టెక్నాల‌జీ ఆధారిత విద్య‌ను అందించిన‌ట్లు తెలిపారు. ఇంట‌ర్నెట్ యాక్సెస్ లేని వారికి కూడా ఆ ఛాన‌ళ్ల ద్వారా సేవ‌లు అందించిన‌ట్లు చెప్పారు. మార్చి 24వ తేదీ నుంచి దీక్షా ప్లాట్‌ఫాంలో విద్యార్థులు ఆన్‌లైన్ కోర్సులు నేర్చుకుంటున్నార‌న్నారు.  ఆ ఫ్లాట్‌ఫాంను సుమారు 61 కోట్ల మంది వీక్షించిన‌ట్లు చెప్పారు. 

స్వ‌యం ప్ర‌భ కింద ఇప్ప‌టికే మూడు ఛాన‌ళ్లు స్కూల్ విద్యార్థుల‌కు కేటాయించామ‌న్నారు. ఇప్పుడు మ‌రో 12 ఛాన‌ళ్ల‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు. విద్యా సంబంధిత వీడియో కాంటెంట్‌ను విద్యార్థుల‌కు చేర‌వేసేందుకు ఎయిర్‌టెల్‌, టాటా స్కై లాంటి ప్రైవేటు డీటీహెచ్ ఆప‌రేట‌ర్ల‌తో లింకు పెట్టుకున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఈ-పాఠ‌శాల వెబ్‌సైట్‌లో సుమారు 200 కొత్త పుస్త‌కాల‌ను జోడించిన‌ట్లు సీతారామ‌న్ తెలిపారు.