తెలంగాణలో మరో 41 మందికి కరోనా పాజిటివ్‌

తెలంగాణలో సోమవారం మరో 41 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 26, మేడ్చల్‌ జిల్లాలో మూడు, వలసదారులకు సంబంధించి 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,592కి చేరుకుంది. అందులో వలసదారులు 69 మంది ఉన్నారు. సోమవారం 10 మంది కోలుకోగా, మొత్తం ఇప్పటివరకు 1,002 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు 34 మంది మృతి చెందగా, ప్రస్తుతం 556 మంది చికిత్స పొందుతున్నారని ప్రజారోగ్య సంచాల కుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన బులెటిన్‌ విడుదల చేశారు. ఇక గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాని జిల్లాలు 25 ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారిలో 663 మంది పురుషులు, 339 మహిళలున్నారు. ఇక డిశ్చార్జి అయినవారిలో 61 నుంచి 70 ఏళ్లవారు 60 మంది ఉండగా, 71 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న వారు 15 మంది ఉండటం విశేషమని శ్రీనివాసరావు పేర్కొన్నారు.