వరంగల్ జిల్లా గీసుకొండ బావిలో 9 మృతదేహాలు

వరంగల్ జిల్లా గీసుకొండ మండటం గొర్రెకుంటలోని బావిలో శుక్రవారం మరో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 9కి చేరుకుంది. నిన్న బావిలో 4 మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. ఇందులో ఆరుగురు మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మిగతా వారిలో ఇద్దరు బిహార్‌, ఒకరు పశ్చిమ బెంగాల్‌కు చెందిన డ్రైవర్‌గా గుర్తించారు. పొట్టకూటి కోసం ఎక్కడో పశ్చిమ బెంగాల్‌ నుంచి వలస వచ్చిన కుటుంబం.. ఇరవై ఏళ్లుగా వరంగల్‌ కరీమాబాద్‌లో నివాసముంటూ చినిగిన బస్తా సంచులు(బార్‌దాన్‌) కుడుతూ పొట్ట పోసుకుంటున్నారు. దంపతులతో పాటు కుమార్తె, ఇద్దరు కుమారులు కలిసే ఉండేవారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనిచేసే చోటకు మకాం మార్చిన ఆ కుటుంబంలోని నలుగురు బావిలో.. గురువారం మృతదేహాలుగా తేలారు. కుటుంబ పెద్ద అయిన తండ్రితో పాటు ఆయన భార్య, కుమార్తె, మనవడు విగత జీవులుగా కనిపించడంతో ఎవరైనా హత్య చేశారా.. వారే ఆత్మహత్యకు పాల్పడ్డారా.. అందుకు కారణాలేమై ఉంటాయి.. అనే విషయంలో స్పష్టత లభించడం లేదు. గురువారం వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని పారిశ్రామిక ప్రాంతం వద్ద వెలుగు చూసిన ఈ ఘటన మిస్టరీగానే ఉంది. అయితే శుక్రవారం మరో ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. మృతులు మసూద్‌, నిషా, బుషారాకతూన్‌, బేబీ, షకీల్‌, షాబాజ్‌ అలం, సోహైల్ అలంగా గుర్తించారు. బావిలో నీటిని అధికారులు బయటకు తీస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను వరంగల్‌లోని ఎంజీఎంకి తరలించారు.