తంగేడు వనం

తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు తంగేడు వనం పేరుతో చౌటుప్పల్ దగ్గరలో చూడటానికి చాలా అందంగా ఫారెస్ట్ ను తయారు చేస్తున్నారు.

తంగేడుపూలు అంటే తెలంగాణ ప్రజలకు ఎంతో ఇష్టం. ఆ పూలతో బతుకమ్మను పేర్చి ఆడుకోవడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ. ఆ పేరునే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు తంగేడు వనం అని ఓ ఫారెస్ట్ కు పెట్టడం ఎంతో బాగుంది.

అంతేకాక చౌటుప్పల్ లాంటి ప్రాంతంలో ఇలాంటి ఫారెస్టులు చాలా అవసరం. అంతేకాదు ఇక్కడ విరివిగా చెట్లను పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ భాధ్యతను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ & పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం పూర్తిగా కెమికల్ పరిశ్రమలతో నిండి ఉంది. ఒక్క కెమికల్ పరిశ్రమలే కాక అనేక రకలైన పరిశ్రమలతో ఇక్కడి భూగర్భజలాలు పూర్తిగా పాడైపోయినాయ్. ఇక్కడ నివాసం ఉంటున్న వారే కాక చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఇక్కడి నీటిని త్రాగి బ్రతికే పరిస్థితి లేదు. ఇందుకు ఉదాహరణగా ఒక్క దొతిగూడెం గ్రామాన్నే చెప్పొచ్చు. ఈ ఒక్క గ్రామ పరిధిలోనే 8 వరకు కెమికల్ పరిశ్రమలు ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఈ పరిశ్రమల వల్ల ఆ గ్రామ చుట్టుపక్కల భూములలోని భూగర్భజలాలు పూర్తిగా పాడైనాయి అని అందరికి తెలిసిన విషయమే. అంతేకాదు చౌటుప్పల్ చుట్టూ ప్రక్కల కూడా భూగర్బ జలాలు పూర్తిగా పాడైనాయి. అలాగే ఇక్కడి పరిశ్రమలు వదిలే కాలుష్యంతో ఈ ప్రాంత ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి నాకే కాదు.. అపర మేధావులందరికి తెలిసిన సంగతే. ఈ సమస్యపై ఎంతమంది ఎన్ని పోరాటాలు చేసిన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. దీనిపై ముందు ముందు ఇంకా వివరంగా రాస్తా.

ఇది అలా ఉంచితే తంగేడు వనం పేరుతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తెలంగాణ ప్రభుత్వం చౌటుప్పల్ లాంటి ప్రాoతంలో ఈ ఫారెస్టును విరివిగా చెట్లను పెంచుతూ అక్కడి ప్రాంతానికి జరిగిన నష్టాన్ని కొంతలో కొంతైనా తీర్చే ప్రయత్నం చేయడం మెచ్చుకో దగ్గ విషయంగా చెప్పొచ్చు. ఈ ఒక్కదానితో సరిపెట్టుకోకుండా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా విరివిగా చెట్లను నాటించి పెంచే బాధ్యతను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు బాధ్యతగా తీసుకోని అక్కడి పరిశ్రమల వారితో చేపిస్తే ఆప్రాంతానికి కొంతైనా ఉపశమనం కలిగించిన వాళ్ళం అవుతాం.
ముందు ముందు రోజుల్లో పర్యవణాన్ని రక్షించుకునే భాధ్యతలో పర్యావరణ పరిరక్షణ సమితి మీ ముందుంటుంది.