తెలంగాణలో మరో 52 మంది కరోనా బారినపడ్డారు. తీవ్ర వ్యాధి ప్రభావం ఉన్న ఒక వ్యక్తి మరణించగా, చికిత్స ద్వారా కోలుకున్న 25 మంది డిశ్చార్జి అయినట్లు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ శనివారం విడుదలచేసిన బులెటిన్ ద్వారా వెల్లడించింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 52 మందిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 33 మంది ఉండగా, మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కార్మికులు 15 మంది, కువైట్ నుంచి వచ్చిన నలుగురు ఉన్నట్టు తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,813కి చేరింది. వీరిలో 1068 (59 శాతం) మంది డిశ్చార్జి అయ్యారు. 49 మంది (3 శాతం) మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దవాఖానలో 696 మంది (38 శాతం) చికిత్స పొందుతున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న వలస కార్మికుల్లో 119 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. కరోనా సోకిన వలస కార్మికుల్లో యాదాద్రి జిల్లాలో 35 మంది, రాజన్న సిరిసిల్ల 4, నిర్మల్ 2, నల్లగొండ 7, మంచిర్యాల 23, మహబూబాబాద్ 5, ఖమ్మం 2, కరీంనగర్ 2, జయశంకర్ భూపాలపల్లి 1, జనగాం 5, నిజామాబాద్ 3, జగిత్యాల జిల్లాలో 30 మంది ఉన్నారు.
