కాలుష్యకోరల్లో చిక్కుకున్న మల్లాపూర్ పారిశ్రామికవాడపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ పారిశ్రామికవాడలో కాలుష్య మూలాలను, ఇందుకు కారకులను గుట్టురట్టు చేసేందుకు నడుం బిగించింది. ఇందు కోసం పర్యావరణ ఇంజినీర్లు, సైంటిఫిక్ ఆఫీసర్లు, ఇతర అధికారులతో కూడిన నాలుగుబృందాలను నియమించింది. నగర శివారులోని బోడుప్పల్ ‘రా’ చెరువులోకి పారిశ్రామిక వ్యర్థజలాలు వచ్చి కలుస్తుండటం, దీనిపై పలు వీడియోలతో సహా స్థానికులు మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
మంత్రి ఆదేశాల మేరకు ‘రా’ చెరువులో నీటి నాణ్యత పరీక్షలను నిర్వహించిన పీసీబీ అధికారులు 73 పరిశ్రమలకు నోటీసులిచ్చారు. అంతటితో ఆగకుండా.. వీటిలో నుంచి కాలుష్య కారకమైన 48 పరిశ్రమలను గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇప్పుడు పారిశ్రామికవాడను జల్లెడపడుతున్నారు. వాయు, జల కాలుష్యం, వ్యర్థ రసాయనాలను వదిలేస్తూ ఉల్లంఘనులకు పాల్పడుతున్న వారి వివరాలను, ఆధారాలను సేకరిస్తున్నారు. ఆయా నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి, వారి ఆదేశాల మేరకు కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోనున్నారు.