ప్రాజెక్టుల్లో కోల్పోయిన అడవికి బదులు కృత్రిమ వనాల సృష్టి
ఎర్రగుంటపల్లి, తేలుకుంట గుట్టల్లో హరితహారం కింద అభివృద్ధి
నిత్య సంరక్షణతో ఏపుగా పెరుగుతున్న మొక్కలు
తరిగిపోతున్న అడవుల సంరక్షణకు అటవీశాఖ సరికొత్తగా ముందుకుసాగుతున్నది. ప్రాజెక్టుల్లో కోల్పోయిన అటవీ ప్రాంతానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తున్న భూముల్లో కృత్రిమ అడవిని సృష్టిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీ పంప్‌హౌస్ కోసం భూపాలప ల్లిలో ఇచ్చిన భూమికిగాను జిల్లాలోని ఎర్రగుంటపల్లి, తేలుకుంటలో తీసుకున్న గుట్టల్లో ఏడాదిగా వన వృద్ధి చేస్తున్నది. హరితహారం కింద వేలాది మొక్కలు నాటుతూ సత్ఫలితాలు సాధిస్తున్నది. – ధర్మారం
రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లక్ష్మీ పంప్‌హౌస్ కెనాల్‌ను అటవీ ప్రాంతం లో గుండా నిర్మించారు. ఈ క్రమంలో అటవీశాఖ కోల్పోయిన భూమికి బదులు జిల్లాలోని ధర్మారం మండల ఎర్రగుంటపల్లి శివారులోని సర్వే నెంబర్ 68లో ఉన్న ఊరుగుట్ట, జూలపల్లి మండలం తేలుకుంటలోని 1,380/ బీ సర్వే నంబర్‌లో ఉన్న గుట్టలను ప్రభుత్వం కేటాయించింది. ఊరుగుట్ట 64.74 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండగా, తేలుకుంట గుట్ట 55 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇక్కడ ఇప్పటికే సహజ సిద్ధంగా పెరిగిన వృక్షాలకు తోడు ఖాళీ స్థలం వందలాది ఎకరాల్లో ఉంది. ఈ క్రమంలో ఇక్కడ హరితహారం కింద మొక్కలు నాటి ప్రత్యామ్నాయ వనాలను సృష్టించాలని అటవీశాఖ నిర్ణయించుకున్నది.
16వేల మొక్కల పెంపకం..
కృత్రిమ వనాల వృద్ధిలో భాగంగా గతేడాది డీఎఫ్‌ఓ రవి ప్రసాద్ ఆదేశాల మేరకు ఫారెస్ట్ రేంజ్ అధికారి నాగయ్య, డిప్యూటీ రేంజ్ అధికారి స్వాతి ఆధ్వర్యంలో వేప, నారేప, నెమలి నార, కానుగ, జిట్రేగి, అల్ల నేరేడు, సీతాఫలం మొక్కలను వేలాదిగా నాటారు. ఎర్రగుంటపల్లి ఊరగుట్ట ప్రాంతంలో 10 వేలు, తేలుకుంట గుట్ట వద్ద 6 వేల మొక్కలు పెట్టి, సిబ్బందితో సంరక్షిస్తున్నారు. ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరిగాయి.
వన్యప్రాణుల సంపద వృద్ధికి చర్యలు..
ఎర్రగుంటపల్లి, తేలుకుంటపల్లి గుట్టలను వనాలుగా వృద్ధి చేస్తున్న క్రమంలో వన్యప్రాణుల సంరక్షణకూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లు పెద్ద సంఖ్యలో ఉండగా, కొత్తగా కొండ గొర్రెల అడుగు జాడలు కూడా కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వేసవి దృష్ట్యా గుట్ట కింది ప్రాంతాల్లో నీటి వసతి ఏర్పాటు చేశారు. త్వరలోనే సాసర్ పిట్స్ (నీటి గుంతలు) నిర్మించడంతోపాటు కొత్తగా అటవీ జంతువులను సైతం పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వన సంరక్షణకు కంచెలు..
గుట్టల్లోని అరుదైన వృక్షాలు, వన్యప్రాణుల రక్షణతోపాటు అటవీభూములను ఎవరూ ఆక్రమించకుండా ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. రూ.60లక్షలతో ఎర్రగుంటపల్లిలో ఊరుగుట్ట చుట్టూ 4.2 కిలోమీటర్ల పొడవున, రూ.53లక్షలతో తేలుకుంటలోని గుట్ట చుట్టూ 4.7కిలో మీటర్ల మేర ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఫారెస్ట్ రేంజి అధికారి (ఎఫ్‌ఆర్‌ఓ) నాగయ్య తెలిపారు.
సోర్స్: నమస్తే తెలంగాణ