గొర్రెకుంట హత్య కేసులో సంచలన నిజాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినగీసుకొండ మండలం గొర్రెకుంట హత్య కేసులో నమ్మశక్యం కాని విషయాలు బయటపడ్డాయి. ఈ మేరకు పది మందిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితుడు బిహార్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ కృరత్వాన్ని వరంగల్‌ సీపీ మీడియా ముందు వెల్లడించారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భంగా సీపీ మాట్లాడారు. మక్సూద్‌ కుటుంబంతో పాటు మరో ఐదుగురిని మొత్తం పది మందిని సంజయ్‌‌ కుమార్ దారుణంగా‌ హత్య చేశాడని వరంగల్‌ సీపీ నిర్ధారించారు. కేసు వివరాలను సీపీ తెలియజేస్తూ.. ‘గోనె సంచుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మక్సూద్‌ కుటుంబం కనిపించడం లేదని ఆ ఫ్యాక్టరీ ఓనర్‌ ఫిర్యాదు మేరకు మే 21వ తేదీన కేసు నమోదు చేశాం. అదే రోజున సమీపంలోని బావిలో తొలుత (గురువారం) నాలుగు శవాలను బయటకు తీశాం. దానిలో మక్సూద్‌, భార్య, కూతురు, కుమారుడి శవాలు ఉన్నాయి. మరో రోజు (శుక్రవారం) అదే బావిలో మరో ఐదు శవాలు బయటపడ్డాయి. ఇది హత్య లేక ఆత్మాహత్య..? అని నిర్ధారించడానికి ఆరు టీంలను ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌ నుంచి క్లూ టీమ్‌ కూడా రప్పించాం. ఈ క్రమంలోనే కేసును చేధించాం. 

వివాహేతర సంబంధం.. కూతురిపై కన్ను
మక్సూద్‌ కుటుంబం మొత్తం గోనె సంచీలు తయారుచేసే ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్లు. వీరికి బిహార్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ నాలుగేళ్ల కిత్రం పరిచయం అయ్యాడు. మక్సూద్‌ భార్య అక్క కూతూరు రఫీకా పశ్చిమ బెంగాల్‌ నుంచి తన కూతురుతో పాటు వచ్చి ఇక్కడే పని చేస్తోంది. దీంతో రఫీకాకు సంజయ్‌ కూమార్‌ యాదవ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే అది వివాహేతర సంబంధంగా మారింది. వారిద్దరూ కలిసి సహజీవనం సాగించారు. ఈ క్రమంలోనే సంజయ్‌ రఫీకా కూతురుపై కన్నేశాడు. దీంతో వారిద్దరి మధ్య వివాదం ఏర్పడింది. ఆ తరువాత మాయమాటలు చెప్పి రఫీకాను పెళ్లి చేసుకుంటా అని మార్చి 7న పశ్చిమ బెంగాల్‌ తీసుకుపోతా అని నమ్మించాడు. ఏడో తేదీన ఇద్దరూ గరీభ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో కోల్‌కత్తాకు బయలుదేరారు. అప్పటికే రఫీకా కూతూరుపై కన్నుపడంతో ఆమెను అంతం చేయాలని కుట్రపన్నాడు. దీనిలో భాగంగా ప్రయాణ సమయంలో మజ్జికలో నిద్రమాత్రలు ఇచ్చి.. తెల్లవారుజామున 3 గంటలకు చున్నీతో మెడకు బిగించి రఫీకాను రైలు నుంచి కిందకు తోశాడు. ఆంధ్రప్రదేశ్‌లోని నిడదోవులు ప్రాంతంలో రఫీకా మృత దేహాన్ని కూడా అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద కేసుగా అది నమోదు అయ్యింది.
అన్నంలో నిద్రమాత్రలు కలిపి.. బావిలో
ఆ తరువాత సంజయ్‌ను మక్సూద్‌ కుటుంబం సంజయ్‌ కుమార్‌ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. రఫీకా ఎక్కడా అంటూ రోజూ నిలదీసేవారు. ఈ క్రమంలోనే వారిపై కక్ష పెట్టుకున్నాడు. బండారం బటయపడుతుందేమో అని వారిని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 20 తేదీన దానికి ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. అదే రోజున మక్సూద్‌ పెద్ద కుమారుడి పుట్టిన రోజు కావడంతో వారందరినీ హతమార్చాలని పథకం రచించాడు. హన్మకొండలో నిద్రమాత్రలు కొన్నాడు. అదే రోజు వాళ్లు వండుకున్న భోజనంలో, కూల్‌ డ్రింక్‌లో ఎవరికీ తెలియకుండా కలిపాడు. ఈ క్రమంలో మక్సూద్‌తో పాటు బిహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాం కూడా ఉన్నారు. వారిద్దరూ బతికితే తన బండారం బయటపడుతుందని భావించి.. వారి ఆహారంలో కూడా నిద్రమాత్రలు కలిపాడు. నిద్ర మాత్రలు కలిపిన భోజనం తినడంతో రాత్రి 12కు లోపు వాళ్లంతా నిద్రలోకి జారుకున్నారు. ఆ తరువాత గోనె సంచిలో పెట్టి మక్సూద్‌ కుటుంబాన్ని బావిలో వేశాడు. అనంతరం ఇద్దరు బిహార్‌ యువకులను కూడా బావిలో తోశాడు. రాత్రి  2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ తతంగం జరిగింది. ఆ తరువాత సైకిల్‌పై సంజయ్‌ బయటకు వెళ్లిపోయాడు. నిందితుడు చేసింది చాలా ఘోరమైన చర్య. తప్పకుండా కఠిన చర్య పడేలా చూస్తాం.’ అని వరంగల్‌ సీపీ తెలిపారు.