కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. దేశవ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించింది. కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్‌డౌన్ పరిమితం చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలు దశలవారీగా తిరిగి ప్రారంభించుకునేందుకు అనుమతినిచ్చింది. తాజాగా మరిన్ని సడలింపులతో లాక్‌డౌన్ 5.0 మార్గదర్శకాలను కూడా కేంద్రం విడుదల చేసింది.
రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. జూన్ 8 నుంచి ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు అనుమతించింది. విద్యాసంస్థలపై జులైలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. ఆంక్షల సడలింపులతో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు కొనసాగించాలని కేంద్రాన్ని ఇప్పటికే పలు రాష్ట్రాలు కోరాయి.