మానవ హక్కుల కమిషన్ లో పలువురి ఫిర్యాదు
పీసీబీ సభ్య కార్యదర్శికి నోటీసులు
పంట పొలాల్లోనూ విషపు నురగలు
మూసీ నీళ్లు విషాన్ని చిమ్ముతున్నాయని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో చౌటుప్పల్ కు చెందిన పలువురు పర్యావరణ వేత్తలు ఫిర్యాదు చేశారు. ఈ కాలుష్య నీరుతో ప్రజలు అంటు వ్యాధులతో అల్లాడుతుంటే, మేకలు, గొర్రెలు మృత్యువాత పడుతున్నాయని పేర్కొంది. ఈ సమస్యపై పలుమార్లు నల్లగొండ కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. కావున తమరు తక్షణమే కాలుష్యానికి కారకులైన వారిపై చర్యలు తీసుకునేలా సంబంధిత శాఖాధికారులకు అదేశాలు ఇవ్వాలని కోరింది. వివిధ రూపాల్లో మూసీ చౌటుప్పల్, లింగోటం గ్రామాల్లో ప్రవహిస్తుందని కమిషన్ దృష్టికి తీసుకొచ్చింది. ఇదే మూసీ నీళ్లతో ఇక్కడి ప్రజలు చాలా మంది వ్యవసాయం చేస్తున్నారని తెలిపింది. విషం కక్కుతున్న నీళ్లతో ప్రజలు అంటురోగాలు ఇతర అనారోగ్యాల బారినపడుతున్నారని, మూసీ ప్రక్షాళనకు తగిన చర్యలు తీసుకునేలా సంబంధిత శాఖకు అదేశాలు ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ ను వేడుకున్నారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన కమిషన్.. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (హైదరాబాద్) సభ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.
పంట పొలాల్లోనూ విషపు నురగలు
చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి మండలాల్లోని పలు పరిశ్రమలు ఉత్పత్తుల తర్వాత వచ్చే వ్యర్థాలను పిలాయిపల్లి కాలువలో పారబోస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), పోలీసుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉండటంతో పరిశ్రమలకు చెందిన అక్రమార్కులు అర్థరాత్రి వేళలో తమ పనిని గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారు. పిలాయిపల్లి కాలువ నీటితో పంట సాగును రైతులు చేపడితే పొలాల్లోను నిలిచిన నీటిపై విషపు నురగలు తేలుతున్నాయి. రైతులు పంటలు పండక పెట్టుబడి కోల్పోతున్నామని అవేదన చెందుతున్నారు. ఇప్పటికైన పీసీబీ అధికారులు స్పందించి కాలుష్యానికి కారణమైన పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.