‘తెలంగాణకు హరితహారం’తో నగరానికి గ్రీనరీ

హైదరాబాద్‌ కనువిందు చేస్తున్నది. పచ్చని అందాలతో అలరారుతున్నది. ‘తెలంగాణకు హరితహారం’లో భాగంగా ఆకుపచ్చని హారం తొడుక్కొని ము(మె)రిసిపోతున్నది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రతీ ప్రాంతం పిక్నిక్‌ స్పాట్‌గా మారగా వాటి అందాలకు నగర వాసులు ఫిదా అవుతున్నారు.
హైదరాబాద్‌.. అందాల హరితవనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నది. రాష్ట్రం ఆవిర్భవించిన మరుసటి సంవత్సరం నుంచి ప్రభుత్వం చేపడుతున్న ‘తెలంగాణకు హరితహారం’ నగర రూపురేఖలను మార్చింది. మెడ చుట్టూ మణిహారంగా నగరం చుట్టూ హరితతోరణంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. ఔటర్‌ రింగ్‌రోడ్డుతో పాటు ప్రధాన రహదారులకు ఇరువైపులా చేపట్టిన “ఎవెన్యూ ప్లాంటేషన్‌” అందాల హరివిల్లును తలపిస్తున్నాయి. దేశంలోనే సరికొత్త రికార్డును సృష్టించిన ‘తెలంగాణకు హరితహారం’లో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ప్రధాన భూమికను పోషిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. హెచ్‌ఎండీఏ పరిధిలోని మొత్తం 29 నర్సరీల్లో 13 కోట్ల మొక్కలను పెంచడమే కాక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు అవసరమైన మొక్కలను పంపిణీ చేసి హరిత ఉద్యమంలో కీలక భూమికను పోషిస్తున్నది.

అంతేకాక హైదరాబాద్‌ అప్పా నుంచి మొదలుకుని గజ్వేల్‌ వరకు, హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ రాజీవ్‌ జాతీయ రహదారి వరకు మొక్కలను నాటడంతో పాటు జిల్లాల్లో బ్లాక్‌ ప్లాంటేషన్‌ ద్వారా అటవీ పునరుజ్జీవనానికి తోడ్పడింది. కేబీఆర్‌ పార్కు తరహాలో 16 అర్బన్‌ ఫారెస్ట్రీ బ్లాక్‌లను పిక్నిక్‌ కేంద్రాలుగా మలిచింది. మున్సిపాలిటీలలోని ఖాళీ స్థలాలలో పార్కులను అభివృద్ధి పరిచింది. ‘కోతులు అడవికి వాపస్‌ పోవాలి, వానలు వాపస్‌ రావాలి, ‘దేశ ప్రగతికి మెట్లు..పెరిగే చెట్లు’ అన్న నినాదంతో నేడు ప్రకృతి మాతకు పచ్చలహారం తొడగడంలో హెచ్‌ఎండీఏ అర్బన్‌ఫారెస్ట్రీ విభాగం సమర్థవంతంగా రాణిస్తున్నది.
సెంట్రల్‌ మీడియన్‌ల అభివృద్ధి..
భువనగిరి (4 కిలోమీటర్లు మేర) సంగారెడ్డి (4 కి.మీ), కండ్లకోయ (0.8 కి.మీ), గజ్వేల్‌ (1.8 కి.మీ), రాజీవ్‌ రహదారి (23.0 కి.మీ), పెద్ద అంబర్‌పేట నుంచి హయత్‌నగర్‌ (5. 0 కి.మీ), శంకర్‌పల్లి టూ గండిపేట ( 15.0 కి.మీ), తుక్కుగూడ టూ మహేశ్వరం గేట్‌ (6. 0 కి.మీ)లతో పాటు గజ్వేల్‌ టౌన్‌లో పచ్చదనం, సుందరీకరణ పనులను అధికారులు చేపట్టారు.
హెచ్‌ఎండీఏ పరిధిలోని అర్బన్‌, స్థానిక సంస్థలకు చెందిన ఖాళీ స్థలాల్లో పార్కులను అభివృద్ధి చేశారు. అంతేకాక బోడుప్పల్‌, బడంగ్‌పేట్‌, మీర్‌పేటలలో పార్కుల నిర్మాణం పూర్తి చేశారు. శంషాబాద్‌, మేడ్చల్‌, జిల్లెలగూడ, షాద్‌నగర్‌, ఫిర్జాదిగూడ, శివరాంపల్లి నేషనల్‌ పోలీస్‌ అకాడమీ సమీపంలోని హసన్‌నగర్‌లో పార్కుల నిర్మాణ పనులను చేపట్టారు.
నర్సరీలలో సిద్ధం చేసిన మొక్కలను ఆయా గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, డిఫెన్స్‌ సంస్థలు, పోలీస్‌, ప్రైవేట్‌ కంపెనీలు, ఫ్యాక్టరీలు, కాలనీలు, స్కూల్స్‌, కాలేజీలకు ప్రత్యేక వాహనాల ద్వారా అధికారులు పంపిణీ చేశారు. అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, సిద్దిపేట, వనపర్తి, వరంగల్‌, సంగారెడ్డి, నిజామాబాద్‌, నల్గొండ, గద్వాల్‌ జిల్లాలకు మొక్కలను అందజేశారు.
ఔటర్‌ చుట్టూ కేబీఆర్‌ లాంటి పార్కులు ఒకప్పుడు పొదలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండే అర్బన్‌ ఫారెస్ట్రీ బ్లాక్‌లను కేబీఆర్‌ పార్కు తరహాలో తీర్చిదిద్దారు. 25 చోట్ల ఫారెస్ట్రీ బ్లాక్‌లను చేపట్టాలని నిర్ణయించి తొలుత 16 చోట్ల పనులను శ్రీకారం చుట్టారు. ఆరోగ్యం, ఆహ్లాదకర వాతావరణానికి కేరాఫ్‌ అనే రీతిలో ఈ ఉద్యానవనాలు రూపుదిద్దుకున్నాయి.
పచ్చదనం పెంపులో ప్రత్యేకతలు
మియావాకి పద్ధతిలో తొలిసారిగా దుండిగల్‌, పెద్ద అంబర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌లలోని 3000 స్కేర్‌ మీటర్ల పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలను నాటారు. 138 కిలోమీటర్ల మేర బ్లాక్‌ ఫ్లాంటేషన్‌ నిర్వహించారు. డిఫెన్స్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో 30 హెక్టార్ల స్థలం, జవహర్‌నగర్‌లో 27 హెక్టార్లు, జేఎన్‌టీయూహెచ్‌లో 3.60 హెక్టార్లు, సుల్తాన్‌పూర్‌ క్యాంపస్‌లోని 2.43 హెక్టార్ల స్థలంలో బ్లాక్‌ ఫ్లాంటేషన్‌ పద్ధతిలో మొక్కలు నాటి తీర్చిదిద్దారు.
ఔటర్‌లో నాటిన మొక్కలు11,12,752
భాగ్యనగరానికే తలమానికమైన ఔటర్‌ రింగు రోడ్డును హెచ్‌ఎండీఏ నందనవనంగా మార్చింది. ఔటర్‌కు ఇరువైపులా ప్రత్యేకంగా రైల్వేకారిడార్‌, సర్వీసురోడ్‌, సెంట్రల్‌ మీడియన్‌ లాంటి స్థలాల్లో పచ్చని అందాలను పెంచింది. 2015 నుంచి 2020 మధ్య కాలంలో ఔటర్‌లో 11,12,752 మొక్కలను నాటినట్లు అర్బన్‌ఫారెస్ట్రీ విభాగం అధికారులు వెల్లడించారు. 2014లో 85, 271, 2015లో 1,26, 939, 2016లో 1,36, 251 మొక్కలు, 2017లో 4,50,181లు, 2018లో 2,33,291లు, 2019లో 35,197 మొక్క లు నాటారు. పొగడ, గన్నేరు, దురంద, అకాలిఫా, ఇనేర్మి, ఫడరన్‌ తదితర మొక్కలను నాటి పచ్చని తోరణంగా ఔటర్‌ మార్గాన్ని మార్చారు. శామీర్‌పేట, కీసర, బొంగుళూరు, అప్పా జంక్షన్‌, నార్సింగ్‌, దుండిగల్‌లో ఉన్న రెండేసీ రోటరీలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
కనువిందు చేసేరాజీవ్‌ రహదారి..
సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాజీవ్‌ రహదారిలో పచ్చందాలను సమకూర్చారు. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌-రామగుండం వెళ్లే ప్రయాణికులకు ఆహ్లాదపరిచే అందాలను పరిచయం చేశారు. తూంకుంట నుంచి (స్పోర్ట్స్‌ స్కూల్‌) గౌరారం వరకు 26 కిలోమీటర్ల మేర రహదారిని ఆకుపచ్చగా మార్చారు.
Source: Namaste Telangana