సీపీఐ సీనియర్ నాయకులు టీవీ చౌదరి(80) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తన నివాసంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చౌదరి మృతిపట్ల సీపీఐ జనరల్ సెక్రటరీ సురవరం సుధాకర్ రెడ్డి, పువ్వాడ నాగేశ్వరరావు, చాడ వెంకట్ రెడ్డితో పాటు పార్టీ శ్రేణులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బుధవారం ఉదయం 9:30 గంటలకు సీపీఐ జిల్లా కార్యాలయానికి చౌదరి భౌతికకాయాన్ని తరలించనున్నారు. సీపీఐ నేతలు, కార్యకర్తలు.. నివాళులర్పించనున్నారు.
సీపీఐ పార్టీలో రాష్ట్ర స్థాయిలో, ఖమ్మం జిల్లాలో చౌదరి పలు బాధ్యతలు నిర్వర్తించారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, కార్యదర్శిగా ఆయన పని చేశారు. సుదీర్ఘకాలం పాటు సీపీఐ జిల్లా కార్యదర్శిగా చౌదరి సేవలందించారు.
