విరివిగా మొక్కలు నాటాలి
కస్బెకట్కూర్‌లో మంకీ ఫుడ్ కోర్ట్ భేష్
సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్
పదిర అటవీప్రాంతం, మండెపల్లిలో పర్యటన
ఎల్లారెడ్డిపేట/ కోనరావుపేట/ సిరిసిల్ల రూరల్ : జిల్లా హరిత శోభితం కావాలని, విరివిగా మొక్కలు నాటాలని తెలంగాణకు హరితహారం ప్రత్యేకాధికారి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర అటవీప్రాంతాన్ని, మండెపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డితో కలిసి కోనరావుపేట మండలంలోని నాగారం గ్రామాన్ని బుధవారం సందర్శించారు. నాగారంలో ఇంటి ఆవరణలతో పాటు రాముల గుట్ట, పెద్ద గుట్ట, పొట్టి గుట్టలపై హరితహారంలో అధికసంఖ్యలో మొక్కలు నాటాలని సూచించారు. గతంలో మాదిరిగా కోదండ రామస్వామి ఆలయ ప్రాంగణమంతా పచ్చదనంతో నింపుతామన్నారు. గ్రామంలో నర్సరీలో మొక్కలు ఎదుగుతున్న తీరును చూసి అధికారులను అభినందించారు. అంతకుముందు నాగారంలోని జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్‌ను సందర్శించారు. విద్యార్థులకు ఉన్నత వసతులతో ఉపాధి కల్పిస్తున్న తీరును కొనియాడారు.
అద్భుత లంగ్స్‌స్పేస్ పార్క్‌గా మార్చాలి
ఎల్లారెడ్డిపేట మండలం పదిర అటవీ ప్రాంతాన్ని అద్భుత అర్బన్ లంగ్స్‌స్పేస్ పార్క్‌గా తీర్చిదిద్దాలని ప్రియాంక వర్గీస్ అధికారులకు సూచించారు. ఆ ప్రాంతాన్ని కలెక్టర్‌తో కలిసి సందర్శించారు. మహబూబ్‌నగర్‌లోని మయూ రి పార్క్, కండ్లకోయలోని ఆక్సీజన్ పార్క్ మోడళ్లను తెప్పించుకుని ఓ సుందరమైన పార్కుకు అవసరమైన ప్రణాళికను రూపొందించాలని పేర్కొన్నారు. పోతిరెడ్డిపల్లి, పదిరను కలిపే అటవీప్రాంతబ్లాక్‌లో మొత్తంగా 560 హెక్టార్ల విస్తీర్ణంలో పార్క్‌ను ఎలా అభివృద్ధిచేయాలో ప్రతిపాదనలు పంపించాలని అటవీ, రెవెన్యూ అధికారులకు సూచించారు. 200 హెక్టార్ల స్థలంలో పార్కింగ్, ఎంట్రీగేట్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌ల ఏర్పాటుకు సంబంధించిన డిజైన్ రూపొందించాలన్నారు. మిగతా ఖాళీస్థలంలో అటవీ పునరుజ్జీవన కార్యక్రమాలు రూపొందించి అమలుచేయాలని వివరించారు.
కేసీఆర్ నగర్ వండర్ పుల్..
‘సిరిసిల్ల పట్టణ వాసుల కోసం తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు వండర్ ఫుల్’ అంటూ ప్రియాంక వర్గీస్ కితాబు ఇచ్చారు. మండెపల్లి శివారులో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఇండ్లను ఆమె పరిశీలించారు. రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇండ్ల కాలనీకి కేసీఆర్ నగర్‌గా పేరుపెట్టినట్లు కలెక్టర్ కృష్ణభాస్కర్ వివరించగా, ‘బ్యూటిఫుల్.. చాలా బాగున్నాయ్’ అంటూ ప్రశంసించారు. ప్రధాన గేటులోని మండెపల్లి రహదారిలో వేప మొక్కను నాటి, నీళ్లు పోశారు. అనంతరం కస్బెకట్కూర్‌లోని మానేరువాగు ఒడ్డున మంకీ ఫుడ్ కోర్టును పరిశీలించారు. బొప్పాయి పండ్లను చూసి ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా కోతులకు ఆహారం కోసం పుడ్ కోర్టు ఏర్పాటు చేయడంపై అధికారులు, నాయకులను అభినందించారు. హరితహారంలో మానేరు వాగు ఒడ్డున భారీగా మొక్కలు నాటాలని ఆదేశించారు. కలెక్టర్ కృష్ణభాస్కర్, అదనపు కలెక్టర్ అంజయ్య, జడ్పీ అధ్యక్షురాలు అరుణ, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి ఆశ, డీఆర్డీవో కౌటిల్యారెడ్డి, ఎఫ్‌ఆర్వో వేణుగోపాల్, ఆర్డీవో శ్రీనివాస రావు, ఎంపీపీలు చంద్రయ్యగౌడ్, మానస, సెస్ డైరెక్టర్ తిరుపతి, సర్పంచులు లావణ్య, వేణుగోపాల్ రావు, శివజ్యోతి, ఎంపీడీవోలు రామకృష్ణ, చికోటి మదన్‌మోహన్, తహసీల్దార్లు రమేశ్ బాబు, సదానందం, శ్రీకాంత్, టీఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.