పుడమితల్లి పరిరక్షణకు నడుంకట్టిన ధీశాలులు
బ్రహ్మాండమైన నదీ ప్రవాహం కూడా మొదట ఒక్క నీటి బిందువుతోనే తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. ఎంత గొప్ప ఆవిష్కరణ అయినా చిన్న ఆలోచనతోనే పురుడుపోసుకుంటుంది. తల్లిలా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్న భూమి, తండ్రిలా రక్షిస్తున్న పర్యావరణం మానవాళి చర్యలతో చిక్కిశల్యమైపోవడాన్ని ఆ బాలికలు, యువతులు చూడలేకపోయారు. జీవవైవిధ్యాన్ని కాపాడాలన్న వారి ఆలోచనలు తర్వాతి కాలంలో పెను ఉద్యమాలయ్యాయి. లక్షలాదిమందిని ఆలోచింపజేశాయి. ప్రకృతి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న దేశాధినేతల వైఖరిని ఎండగట్టాయి. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ఏడాది అంశం జీవవైవిధ్యాన్ని కాపాడటం. ఈ సందర్భంగా ప్రకృతి పరిరక్షణకు నడుంకట్టిన చిన్నారులు, యువ తరంగాల ఉద్యమ గాథలు. వాటి వివరాలు..
ప్లాస్టిక్‌ని తరిమేస్తా
‘మీ వ్యర్థాలతో మా తల్లిని (భూమిని) చంపుతున్నారు’ అంటూ ప్లాస్టిక్ భూతానికి వ్యతిరేకంగా ఉగాండాలోని నకాబుయే హిల్డా (28) ర్యాలీలు చేపడుతున్నారు. ప్లాస్టిక్‌ను పారేసిన వ్యక్తులకు కనిపించేలా ఓ సంచిని భుజాన వేసుకుని దాంట్లో ఆ వ్యర్థాల్ని సేకరిస్తూ ఉద్యమిస్తున్నారు.
ఊపిరితిత్తులపై దాడా?
భూగోళానికి ఊపిరితిత్తులుగా భావించే అమెజాన్ అడవుల్లోని చమురు నిక్షేపాలను డ్రిల్లింగ్ చేసేందు కు కార్పోరెట్ కంపెనీలకు ఈక్వెడార్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనిపై నీనా గువాలింగా(27 ) మండిపడ్డారు. కోర్టులో కేసు వేసి, గెలిచి ప్రకృతిని పరిరక్షించారు.
భూముల పరిరక్షణ కోసం..
న్యూజిలాండ్‌కు చెందిన ఇండియా లోగన్ రిలే (25) పర్యావరణ ఉద్య మకారిణి. చెట్లను నరికి పరిశ్రమలకు బాటలు వేయడాన్ని ఆమె వ్యతిరే కించారు. భూపరిరక్షణ, ఆదివాసుల హక్కుల కోసం పోరాడారు. 2017 లో జరిగిన ఐరాస సదస్సులో ఆదివాసుల హక్కుల గురించి మాట్లాడారు.
ఈటెల్లాంటి ప్రశ్నలే ఆమె ఆయుధం
స్వీడన్‌కు చెందిన గ్రెటా థన్‌బర్గ్ 17 ఏండ్ల బాలిక, పర్యావరణ ప్రేమికురాలు. ఉద్యమకారిణి. ‘పర్యావరణ మార్పులపై అశ్రద్ధ వహించడానికి మీకెంత దైర్యం?’ అంటూ ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రపంచ దేశాధినేతలను కడిగిపారేసిన ధీశాలి. పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని 2018లో పాఠశాలను వదిలి స్వీడన్ పార్లమెంటు ఎదుట నిరసనకు దిగడంతో థన్‌బర్గ్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె ప్రసంగాలకు ఆకర్షితులై వేలాదిమంది విద్యార్థులు, యువత, పర్యావరణ ప్రేమికులు ఆమె వెంట నడిచారు. ‘స్కూల్ స్ట్రైక్ ఫర్ ది ైక్లెమేట్’, ‘యూత్ ఫర్ ైక్లెమేట్’ పేరిట పర్యావరణ పరిరక్షణకు ఆమె నిర్వహించిన ఉద్యమాలు ప్రాచుర్యం పొందాయి. ఆమె ఉద్యమ స్పూర్తికి గుర్తుగా ఫోర్బ్స్ గతేడాది ప్రకటించిన ‘వందమంది అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితా’లో ఆమెకు చోటు దక్కింది. 2019, 2020 నోబెల్ పురస్కారానికి కూడా ఆమె నామినెట్ అయ్యారు.
కేంద్రంపైనే ఫిర్యాదు
‘నాకు, నా స్నేహితులకు మంచి భవిష్యత్తు కావాలి. దాని కోసం ఎంత దూరమైనా వెళ్తా’ అంటూ ఓ చిన్నారి ప్రతినబూనింది. పర్యావరణ మార్పులపై చర్యలు తీసుకోవడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ తొమ్మిదేండ్ల వయసులోనే గ్రీన్ ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు చేసింది. ఆమె ఉత్తరఖండ్‌కు చెందిన రిధిమా పాండే. వాతావరణం తీవ్ర సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నప్పటికీ ఏ దేశమూ పట్టించుకోవడంలేదని ఐరాసలో ఫిర్యాదు దాఖలు చేసింది. పర్యావరణాన్ని గాయపర్చడంతోనే 2013లో ఉత్తరఖండ్‌కు వరుదలు వచ్చాయని, ప్రకృతికి హాని చేస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టబోనని ఆమె చెప్తున్నారు.
మీ గౌరవాన్ని తిరస్కరిస్తున్నా
ఇండియన్ ‘గ్రెటా థన్‌బర్గ్’గా పేరొందిన మణిపూర్‌కు చెందిన ఎనిమిదేండ్ల బాలిక లిసీప్రియా కంగుజం.. ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన పర్యావరణ ఉద్యమకారిణిగా గుర్తింపుపొందారు. ప్రతి విద్యార్థి ఏడాదికి పది మొక్కల్ని నాటితేనే వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత చేసేలా కొత్త నిబంధన తీసుకురావాలంటూ సర్కారుకు పలు డిమాండ్లు చేశారు. గత మహిళా దినోత్సవం రోజున ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతాల్ని స్పూర్తిదాయక మహిళలకు అప్పగిస్తానని ప్రకటించడం తెలిసిందే. జాబితాకి లిసీప్రియా కూడా ఎంపికయ్యారు. అయితే, ‘మీరిచ్చే గౌరవాన్ని నిరాకరిస్తున్నా’ అని ప్రధానికి కూడా ఎలాంటి జంకు లేకుండా సందేశం పంపారు. పర్యావరణాన్ని కాపాడాలంటూ తాను పెట్టుకుంటున్న మొరల్ని ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
{Source: NT)
