హరితహారానికి సిద్ధంగా 24.66 కోట్ల మొక్కలు
త్వరలో కలెక్టర్లు, అటవీ అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ
రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశంలో సీఎస్
ఈ నెల 20 నుంచి చేపట్టనున్న ఆరోవిడుత హరితహారంలో నాటిన ప్రతి మొక్కను బతికించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బీర్కేభవన్లోని సచివాలయంలో గురువారం హరితహారంపై రాష్ట్రస్థాయి స్టీరింగ్‌కమిటీ సమావేశం జరిగిం ది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. శాఖల వారీగా మొక్కలు ఎక్కడ నాటాలో నిర్ణయించి బాధ్యత తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. పంపిణీ చేసిన మొక్కలన్నీ నాటారో లేదా చూడాలని చెప్పినట్టు సమాచారం. శాఖలవారీగా ముఖ్యంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇతర స్థానిక సంస్థ లు, ఏరియాల వారీగా స్థలాలను గుర్తించి స్థానికులతో మొక్కలు నాటించాలని, నాటిన మొక్కలకు రక్షణ, నీటి వసతిని కల్పించాలని చెప్పినట్టు తెలిసింది. అన్ని నర్సరీల్లో 24.66 కోట్ల మొక్కలు సిద్ధం చేశామని, ఈ ఏడాది హరితహారంలో 20 కోట్ల మొక్కలకు తగ్గకుండా నాటాలని పేర్కొన్నారు.
ఏటా 40 కోట్ల మొక్కలు నాటాలనే టార్గెట్ ఉన్నదని, ఈ ఏడాది అంతభారీ లక్ష్యం లేనందున, నాటిన ప్రతి మొక్కను బతికించాలని చెప్పారు. అతిత్వరలో హరితహారంపై సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీ అధికారులతో సమావేశం నిర్వహిస్తారని చెప్పినట్టు సమాచారం. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, రోడ్లు భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, పీసీసీఎఫ్ శోభ, పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్‌రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నేడు మూడు జిల్లాల్లో సీఎస్ పర్యటన
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పల్లెప్రగతిలో భాగంగా శుక్రవారం కామారెడ్డి, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రతి జిల్లాల్లో రెండు గ్రామాలను ఎంపికచేసుకొని అక్కడ ఆకస్మికంగా పర్యటించి పరిస్థితులపై ఆరా తీయనున్నారు.
గ్రామాలవారీగా ‘ఉపాధి’ ప్రణాళిక: సీఎస్ ఆదేశం
ఉపాధి హామీ పనుల్లో గ్రామాలు, మండలాలవారీగా ప్రణాళికలు రూపొందించి అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం బీఆర్కే భవన్‌లోని సచివాలయంలో ఉపాధి హామీ పనులపై సమీక్షించారు. ఉపాధి హామీ పనులు చేపట్టడానికి సీజనల్ క్యాలెండర్ రూపొందించాలన్నారు. గ్రామీణ యువతకు ఉపాధి కలిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని సీఎస్ తెలిపారు. ఈ మేరకు గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, పీసీసీఎఫ్ శోభ, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్‌రావు, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా చొంగ్తులతో పాటు వివిధ అధికారులు పాల్గొన్నారు.