లాక్‌డౌన్‌లో 79 శాతం తగ్గిన డిల్లీ కాలుష్యం.. తిరిగి వేగంగా పెరుగుతున్న కాలుష్యం

దేశ రాజధాని డిల్లీలో కాలుష్య స్థాయి సుమారు 79 శాతం తగ్గినట్లు సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఆండ్‌ ఎన్విరాన్‌మెంట్‌(సీఎస్‌ఈ) తన అధ్యయనంలో కనుగొన్నట్లు తెలిపింది. కరోనా వైరస్‌ నియంత్రన నేపద్యంలో ప్రభుత్వాలు అమలు చేస్తన్న లాక్‌డౌన్‌ మూలంగా పారిశ్రామిక కార్యకలాపాలు, వాహనాల రద్దీ, నిర్మాణ రంగ కార్యకలాపాలు తగ్గడం వల్ల కాలుష్యం తగ్గినట్లు తెలిసినదే. తిరిగి కార్యకలాపాలు అన్నీ మెల్ల మెల్లగా ప్రారంభమవుతున్నందున తిరిగి డిల్లీలో కాలుష్యం వేగంగా పెరగుతున్నట్లు వారు అధ్యయనంలో పేర్కొన్నారు.
లాక్‌డౌన్‌ కాలంలో డిల్లీతో పాటు ఆరు ప్రధాన నగరాలైన ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరులో పీఎం 2.5 స్థాయిపై అధ్యయనం చేసిన సంస్థ ప్రస్తుతం డిల్లీలో కాలుష్య స్థాయి నాలుగు నుంచి ఎనిమిది రెట్లు పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ లెక్కలు ఇతర నగరాల్లో మాత్రం రెండు నుంచి ఆరు రెట్లు మాత్రమే ఉన్నాయని సంస్థ తెలిపింది. ప్రారంభ లాక్‌డౌన్‌ దశలో పీఎం 2.5 స్థాయి 45 నుంచి 88 శాతం వరకు తగ్గాయి. తిరిగి కార్యకలాపాలు ప్రారంభమవుతుండడంతో డిల్లీలో వేగంగా రెండు నుంచి ఆరు రెట్లు కాలుష్యం పెరిగింది. దీంతో అతి త్వరగా కాలుష్యం తగ్గడం, అతి త్వరగా కాలుష్యం పెరగడంలో వేగవంతమైన తేడాలను డిల్లీ నమోదు చేసింది.

డిల్లీలో కాలుష్యం తగ్గడానికి ముఖ్య కారణం డిసెంబర్‌, జనవరి నెలలతో పోలిస్తే ఎప్రిల్‌లో నగరంలోని మొత్తం ట్రాఫిక్‌లో 97 శాతం తగ్గిపోవడం, బయట నుంచి వచ్చే 91 శాతం భారీ వాహనాలు, ట్రక్కులు, కమర్షియల్‌ వాహనాలు తగ్గిపోవడం కారణమని అధ్యయనం పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో 84399 వాహనాలు డిల్లీలో ప్రవేశించగా లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతున్న ఎప్రిల్‌ నెలలో మాత్రం 7942 వాహనాలు మాత్రమే ప్రవేశించాయి.
డిల్లీలో పుమారు 12.1 మిలియన్‌ల వాహనాలు రిజిస్టర్‌ అయి ఉన్నాయి. వాటిలో 4.6 వాహనాలు ప్రైవేటు వాహనాలు. వీటిలో కార్యాలయాలకు నడిచే వాహనాలు 60 శాతం తగ్గాయి, ఇతర అవసరాలకు, వినోద కార్యకలాపాలకు వెళ్ళే వాహనాలు 84 శాతం తగ్గాయి. నివాస ప్రాంతాల్లో కార్యకలాపాలు 29 శాతం పెరిగాయి. సైక్లింగ్‌, నడక మార్గాన్ని ఎంచుకునే వారి సంఖ్య 14 శాతం నుంచి 43 శాతానికి పెరిగినట్లు అధ్యయనం పేర్కొంది.
ప్రస్తుతం తిరిగి కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతున్నందున కాలుష్యం ఎప్పటిలా పెరిగిపోయే అవకాశం ఉన్నందున గాలిని స్వచ్చంగా ఉంచేందుకు వెంటనే ప్రణాళికలు సిద్దం చేయాలని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనుమితా రాయ్‌ చౌదరి తెలిపారు. దీనిలో భాగంగా బీఎస్‌ 6 వాహనాలను సత్వరమే అమలు చేయాలని, ప్రజా రవాణా వైపు ప్రజలు మళ్ళేలా చర్యలు తీసుకోవాలని, బ్యాటరీ ఆధారిత వాహనాల వినియోగాన్ని, సైక్లింగ్‌ను ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు.