నల్లగొండ, సూర్యాపేట ప్రభుత్వ వైద్య కాలేజీల్లో వసతులు, నియామకాలపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సూర్యాపేట ఎమ్మెల్యే, మంత్రి జగదీశ్‌రెడ్డి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే నెలల్లో రెండు ప్రభుత్వ కాలేజీల్లో అకడమిక్ ఇయర్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆయా కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఎంబీబీఎస్ విద్యార్థుల ప్రాథమిక అవసరాలు తీర్చేలా వసతుల కల్పన అదేవిధంగా వైద్య, వైద్యేతర సిబ్బంది నియామకంపై మంత్రులు సమీక్ష చేశారు. రెండు వైద్య కాలేజీ ఆస్పత్రుల అభివృద్ధిపై మంత్రులు కూలంకశంగా చర్చించారు.
ఈ సందర్భంగా అకాడమిక్ స్టాఫ్‌ను నియమించాల్సిందిగా మంత్రి ఈటల వైద్యాధికారులను ఆదేశించారు. రెండు ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పించి అభివృద్ధి పరచాల్సిందిగా మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో డైరక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ డాక్టర్ రమేశ్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి ఇతర వైద్య ఉన్నతాధికారులు పాల్గొన్నారు.