ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు విజయవాడకు తరలించారు. గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి అచ్చెన్నాయుడిని తీసుకొచ్చారు. ఏసీబీ కార్యాలయంలోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అచ్చెన్నాయుడితో పాటు మరో ఐదుగురిని ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు.
ఇవాళ ఉదయం 7:20 గంటలకు అచ్చెన్నాయుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంపై విజిలెన్స్ నివేదిక వచ్చిందని, స్కాంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఏసీబీ తెలిపింది.