రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు రానున్న రోజుల్లో ఆక్సిజన్ ఫ్యాక్టరీలుగా పని చేస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఉన్న ఆక్సిజన్ అర్బన్ ఫారెస్టు పార్కును అధికారులతో కలిసి సీఎస్ శనివారం ఉదయం పరిశీలించారు. దాదాపు మూడు గంటల పాటు పార్కును కలియతిరిగిన సీఎస్.. అటవీ పునరుజ్జీవనం, నేల, తేమ పరిరక్షణ, రూట్ స్టాక్ అభివృద్ధి, తెలంగాణ నేలల్లో వృద్ధి చెందే మొక్కల రకాలు, అర్బన్ పార్కుల్లో నాటదగిన మొక్కలు, పర్యావరణ పరంగా చేకూరే లాభం, సందర్శకుల సౌకర్యాలను అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఆక్సిజన్ పార్కు ఎంతో ఆహ్లాదకరంగా, ప్రకృతి స్వర్గంగా ఉందంటూ కొనియాడారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు ఐదు కిలోమీటర్ల పరిధిలో 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో 32 ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 పార్కుల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈ నెల 16వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించి.. హరితహారం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉద్యానవనాల అభివృద్ధిపై చర్చిస్తారని సీఎస్ పేర్కొన్నారు.
యాదాద్రి మోడల్(మియావాకి ప్లాంటేషన్)లో ప్రతీ ప్రాంతంలో కనీసం ఒక ఎకరాలో చిక్కగా మొక్కలు నాటి చిట్టడవులను అభివృద్ధి చేస్తామని సీఎస్ స్పష్టం చేశారు. హరిత తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, పచ్చదనం పెంపు వల్ల అందరి జీవన విధానం మెరుగుపడుతుందని ఆయన చెప్పారు. నిధుల కొరతను అధిగమించి సాచురేషన్ పద్ధతిలో అటవీ పునరుజ్జీవన చర్యలు చేపడుతామన్నారు. అటవీ ప్రాంతాలు అక్రమణలకు గురికాకుండా ఫెన్సింగ్ నిర్మించి, సహజ అటవీ పునరుద్ధరణకు ప్రాధాన్యతను ఇస్తామని సోమేష్ కుమార్ స్పష్టం చేశారు.
