ప్రపంచవ్యాప్తంగా 80 లక్షలకు చేరువలో కరోనా కేసులు

 ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. ప్రాణాంతక వైరస్‌ బారిన పడుతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరుతూనే ఉన్నది. ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు 79,84,432 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ వల్ల 4,35,177 మంది బాధితులు మరణించారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 34,44,882 యాక్టివ్‌ కేసులు ఉండగా, మరో 41,04,373 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా గత 24 గంటల్లో 1,23,783 పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఈ వైరస్‌ బారినపడిన 3258 మంది మృతిచెందారు. 

అమెరికాలో కరోనా కేసులు ఉధృతి కొనసాగుతున్నది. దేశంలో కొత్తగా 19,830 కరోనా కేసులు నమోదవగా, 326 మంది మరణించారు. దీంతో అగ్రరాజ్యంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,62,144కి పెరిగింది. ఈ వైరస్‌ వల్ల ఇప్పటివరకు 1,17,853 మంది మరణించారు. కరోనా కేసుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో ఇప్పటివరకు 8,67,882 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఈ వైరస్‌ ప్రభావంతో 43,389 మంది మరణించారు. ఈ లాటిన్‌ అమెరికా దేశంలో నిన్న ఒక్క రోజే 17,886 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

రష్యాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. దేశంలో ఇప్పటివరకు 5,28,964 కరోనా కేసులు నమోదవగా, 6948 మంది మరణించారు. నాలుగో స్థానంలో ఉన్న భారత్‌లో ఇప్పటివరకు 3,33,008 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 6948 మంది మృతిచెందారు. బ్రిటన్‌లో 2,95,889 కరోనా కేసులు నమోదవగా, 41,698 మంది మరణించారు. స్పెయిన్‌లో కరోనా కేసులు సంఖ్య 2,91,008కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 27,136 మంది మరణించారు. 2,36,989 కేసులతో ఇటలీ, 2,29,736 పాజిటివ్‌ కేసులతో పెరూ, 1,87,671 కేసులతో జెర్మనీ, 1,87,427 కరోనా కేసులతో ఇరాన్‌ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.