తెలంగాణలో ఐదు వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. సోమవారం కొత్తగా 219 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,193కి చేరింది. రాష్ట్రంలో తొలికేసు మార్చి 2న నమోదు కాగా, సరిగ్గా 15 వారాల తర్వాత కేసుల సంఖ్య 5వేలు దాటింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ లోనే అత్యధికంగా 189 ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 13, వరంగల్‌ అర్బన్‌లో 4, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున, మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాద్, యాదాద్రి, వరంగల్‌ రూరల్, వనపర్తి, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. సోమవారం కరోనాతో ఇద్దరు మృతి చెందడంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 187కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 2,766 మంది డిశ్చార్జి కాగా, 2,240 మంది చికిత్స పొందుతున్నారు.