తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ ‘హరితహారం కార్యక్రమాన్ని కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలి. ఉద్యమస్ఫూర్తితో పచ్చదనం పెంచే కార్యక్రమం సాగాలి. కలెక్టర్లు, డీపీవోలు నాయకత్వం వహించాలి. వైకుంఠధామం, డంప్‌యార్డుల చుట్టూ ప్రహరీలు కాకుండా, చెట్లు పెంచాలి. వాటికి గ్రీన్ వాల్ నిర్మించాలి’ అని అన్నారు.
స్మగ్లర్లపై పీడీయాక్ట్
సామాజిక అడవులు ఎంత పెంచినా, అది సహజసిద్ధంగా పెరిగే అడవులకు సాటిరాదని సీఎం కేసీఆర్ అన్నారు. అడవుల పునరుద్ధరణకు, ఉన్న అడవులను కాపాడటానికి అధిక ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు. ‘నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, మహబూబాబాద్, మెదక్ తదితర ప్రాంతాల్లో ఉన్న అడవిని కాపాడాలి. స్మగ్లర్లను గుర్తించి, పీడీ యాక్టు నమోదుచేయాలి. అధిక జనాభా, కాలుష్యం, తక్కువ అడవి ఉండే పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచాలి. రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో చెట్లను పెంచడంతోపాటు, వ్యవసాయ క్షేత్రాల్లోని ఖాళీ జాగాల్లోకూడా చెట్లను పెంచాలి. తక్కువ సమయంలో, తక్కువ విస్తీర్ణంలోనే ఏపుగా పెరిగే లక్షణం ఉన్న మియావాకి పద్ధతిలో కొండ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో చెట్లను పెంచాలి. యాదాద్రి ఫారెస్ట్ మోడల్‌గా దీనికి పేరు పెట్టాలి’ అని సీఎం పేర్కొన్నారు.
తొలగని మిడతల దండు ప్రమాదం
మిడతల దండు ప్రమాదం రాష్ర్టానికి తొలిగిపోలేదని సీఎం కేసీఆర్ అధికారులను హెచ్చరించారు. ‘ప్రస్తుతం మరో దండు వార్ధ్దా సమీపంలోకి వచ్చింది. తెలంగాణకు వచ్చే అవకాశమున్నది. జూన్ 25 నుంచి జూలై నెల వరకు మరోసారి మిడతల దండు వచ్చే అవకాశమున్నదని నిపుణులు చెప్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ, దానికి అనుగుణంగా వ్యూహం ఖరారు చేసుకోవాలి. కరోనా విషయంలో పనిచేస్తూనే, వానకాలంలో వచ్చే అంటు వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి’ అని సీఎం ఆదేశించారు.