దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్నది. ప్రతిరోజు పది వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 1,89,869 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ICMR) వెల్లడించింది.
దేశంలో ఒకేరోజు 1.90 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం ఇదే మొదటిసారని ICMR తెలిపింది. కొత్తగా నిర్వహించిన పరీక్షలతో కలిపి దేశంలో ఇప్పటివరకు మొత్తం 66,16,496 మందికి కరోనా పరీక్షలు చేసినట్లయ్యిందని ICMR ప్రకటించింది. కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 953 ల్యాబోరేటరీల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. అందులో 699 ప్రభుత్వ ల్యాబొరేటరీలు కాగా, 254 ప్రైవేటు ల్యాబొరేటరీలు ఉన్నాయి.