పుడమికి ఊపిరి ప్రకృతికి సంజీవని హరితహారం

ప్రకృతి విపత్తులను తప్పించాలన్నా.. భూక్షయాన్ని నివారించాలన్నా.. కాలుష్య రహిత సమాజం ఏర్పడాలన్నా.. ఆరోగ్యకర జీవితం గడపాలన్నా.. రేపటి తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించాలన్నా.. అన్నింటికీ ఒక్కటే మార్గం.. మొక్కల పెంపకం..! ఈ ప్రాధాన్యాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏటా ‘హరితహారం’ చేపడుతున్నది.. బహుళ ప్రయోజనాలున్న మొక్కలకు ప్రాధాన్యమిస్తూ మొక్కలు నాటిస్తున్నది.. ఇప్పటివరకు ఐదు విడతల్లో నాటిన మొక్కలు సత్ఫలితాలు అందిస్తుండగా ఆరో విడతకు శ్రీకారం చుడుతున్నది.. ఈ నెల 25 నుంచి ‘హరితోద్యమం’ ప్రారంభం కానున్న నేపథ్యంలో మొక్కల ప్రాధాన్యం పట్ల ప్రత్యేక కథనం.. -కొత్తగూడెం

మొక్కలు పెంచడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. చెట్లు ఎక్కువగా ఉంటే జీవవైవిధ్యం పెరుగుతుంది. సారంవంతమైన భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. ముఖ్యంగా చెట్లు కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుని ప్రాణవాయువును వదులుతాయి. ప్రతి మొక్కలోనూ ఔషధ గుణాలున్నాయి. చెట్టు నీడ వేసవి కాలంలో ఉపశమనం కలిగిస్తుంది. మానవ జీవితానికి ఉపయోగపడుతుంది. ఎక్కువ చెట్లు ఉండటం వల్ల సకాలంలో వర్షాలు కురుస్తాయి. తేమశాతం పెరిగి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు ఉంటాయి. అడవి జంతువులకు ఈ మొక్కలు ఆవాసాలుగా ఉంటాయి. వివిధ ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే కాలుష్యాన్ని పీల్చుకుని మనకు ప్రాణవాయువును అందిస్తాయి. దాని వల్ల మానవ మనుగడకు ఎలాంటి ముప్పు వాటిల్లదు. -కొత్తగూడెం

భూమ్మీద మానవ మనుగడ ఉండాలంటే మొక్కల మనుగడ కూడా ఉండి తీరాల్సిందే. మొక్కలు, చెట్లు లేకుండా విశ్వమే లేదు. అలాంటి మొక్కలు, చెట్లు, వృక్షాలు ఒకప్పుడు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేవిగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ మొక్కలకు మానవుడే శత్రువుగా మారిపోయాడు. తరాలు మారుతున్నకొద్దీ తరతరాలుగా వేళ్లూనుకున్న చెట్లు, వృక్షాల జీవనం ప్రశ్నార్థకంగా మారుతున్నది. మున్ముందు మొక్కలు లేని ప్రపంచం ఉండబోతున్నదా? అనే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఏపుగా పెరిగిన వృక్షాలు ఒక్క గొడ్డలి వేటుకు నేలమట్టమవుతున్నాయి. మళ్లీ అలాంటి వృక్షజాతులు ఎన్నేళ్లకు పెరిగి పెద్దవాలి? అందులోనూ మానవ మనుగడతో ముడిపడి ఉన్న మొక్కలు, చెట్లు, వృక్షాల సంగతేంటి? అంటే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి ప్రశ్నలు సమాధానంగా తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ముందుకు తెచ్చింది. దీన్ని ఆరేళ్లుగా అమలు చేస్తూ మొక్కలకు జీవం పోసి చెట్లుగా, వృక్షాలుగా పెంచుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల మొక్కలు ఏపుగా పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈసారి ఔషధ గుణాలున్న మొక్కలను పెంచేందుకు అటవీ శాఖ ప్రాధాన్యం ఇస్తున్నది. మానవ జీవనంలో నిత్యం ఉపయోగపడే మొక్కలను విరివిగా పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఏ మొక్కలో ఎలాంటి ఔషధ గుణాలున్నాయో వివరిస్తున్నది.

హరితోద్యమానికి భద్రాద్రి జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. 6వ విడత హరితహారంలో పకడ్బందీగా మొక్కలు నాటేందుకు ప్ర ణాళిక రూపొందించారు. ఇప్పటికే ఆయా ప్రాంతా ల్లో నాటాల్సిన మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నారు. ఈనెల 25వ తేదీనుంచి హరితహారం కార్యక్రమం చేపట్టనున్నా రు. నర్సరీల నుంచి గ్రామాలకు మొక్కలు సరఫరా చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే వర్షాలు కురుస్తుండటంతో ఈసారి మరింత ఎక్కువ స్థాయిలో మొక్కలు నాటే అవకాశముంది. ఈ ఏడా ది అన్ని ప్రాంతాల్లో కలిపి 1.38.03000 మొక్కల ను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో అన్ని శాఖల అధికారులు కూడా తమ పరిధిలోని నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టారు. అయితే మొ దటి మూడు విడతల్లో నాటిన మొక్కల్లో కొన్ని చనిపోయాయి. వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటే అవకాశముంది. రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభు త్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

1.38 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
ఈ ఏడాది హరితహారంలో జిల్లావ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని శాఖల అధికారులు తమకు కేటాయించిన లక్ష్యాల మేరకు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నర్సరీల్లో పండ్ల మొక్కలను కూడా నాటేందుకు సిద్ధమవుతున్నారు.

నర్సరీల్లో మొక్కలు సిద్ధం
జిల్లాలోని 6 డివిజన్లు, ప్రతి మండలంలోని అటవీశాఖ నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే నర్సరీల్లో లక్ష్యం మేరకు మొక్కల పెంపకం పూర్తయింది. మొత్తం 1,38.03000 మొక్కల పెంపకం చేపట్టారు. అటవీశాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో 8.50లక్షలు, ఇల్లెందులో 6 లక్షలు, పాల్వంచలో 1.43 లక్షలు, మణుగూరులో 1.23లక్షలు, భద్రాచలంలో 94 వేలు, కిన్నెరసానిలో 54 వేలు మొక్కలను మొత్తం 5.59 లక్షల మొక్కలను పెంచారు. రూరల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ ఆధ్వర్యంలో 62.13లక్షలు, ఉద్యానవన 55 వేలు, సింగరేణి 10లక్షల, టీఎస్‌ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో 45వేలు మొక్కలు పెంచారు. వీటిలో మామిడి, కొబ్బరి, నిమ్మ, టేకు, ఉసిరి, క్రోటన్స్‌, పూ ల మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నారు.

స్థలాలను గుర్తించే పనిలో ..
హరితహారాన్ని విజయవంతం చేసేందుకు కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అధికారులకు స్పైష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు ఖాళీస్థలాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. హరితహారం కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొననున్నారు.

బండారు వృక్షం.. విలువైన కలప
దీని శాస్త్రీయ నామం అడైనాకార్డీ పోలియా. రూబియేసి కుటుంబానికి చెందిన ఈ వృక్షం తలుపులు, కిటికీలు, ఫర్నీచర్‌ ఇతర సామగ్రి తయారీకి ఉపయోగపడుతుంది. ఇది ఎంతో విలువైన కలప. ఈ విత్తనాలు నాటేందుకు ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి. అటవీ ప్రాంతాలు, రహదారుల పక్కన నాటుకుంటే మంచిది.

దిరిశెనతో వ్యవసాయ పనిముట్లు
ఆల్‌ బిజియాలెబక్‌ అనేది దీని శాస్త్రీయ నామం. లెగ్యుమినేసి పెద్ద వృక్ష కుటుంబానికి చెందినది. రహదారులకు ఇరువైపులా, తేమ గల ప్రాంతాల్లో వీటిని నాటుకుంటే మంచిది. ఫర్నీచర్‌ తయారీకి, ప్యానలింగ్‌, వ్యవసాయ పనిముట్లు, జిగురు, ఇతర పదార్థాలతో కలిపి వాడతారు.

తీరుమాను (సిరిమాను)..
అంతరించిపోతున్న మొక్కల్లో ఇది ఒకటి. అనోగైనస్‌ లాటిఫోనియా అనేది శాస్త్రీయ నామం. కాంబ్రటేసి పెద్ద వృక్షం కుటుంబానికి చెందినది. వీటిని నాటేందుకు క్షీణించే అటవీ ప్రాంతాలు, రహదారులకు ఇరువైపులా ఉన్న ప్రాంతాలు ఎంతో అనుకూలం. డయింగ్‌లో వినియోగిస్తారు. కలపగా కూడా వాడతారు.

మారేడు/ బిల్వము.. ఆధ్యాత్మిక సౌరభం
దీని శాస్త్రీయ నామం ఏగిల్‌ మార్మలోస్‌. రూపేసి కుటుంబానికి చెందిన ఈ జాతి మొక్కలు వేడి వాతావరణంలో ఎక్కువగా పెరుగుతాయి. కాయలను, వాటిలో ఉండే గుజ్జును ఆయుర్వేద ఔషధాల్లో వినియోగిస్తారు. ఆధ్యాత్మికంగా ఎంతో శ్రేష్ఠమైనది.

అగ్గి పుల్లల తయారీలో కదంబం..
దీని శాస్త్రీయ నామం ఆంథో సెపాలిస్‌ సైనస్‌సిస్‌. రహదారులకు ఇరువైపులా, తేమ ఉన్న ప్రదేశాల్లో నాటుతారు. ప్యాకింగ్‌ బాక్సుల తయారీ, అగ్గిపెట్టెలు, అగ్గిపుల్లల తయారీలో వాడతారు. ఔషధ గుణాలున్న వృక్షమిది.

కొండచింత.. ఇంటికే శోభ

దీన్ని పెల్టోపోరం టీరోకార్పమ్‌ క్యూలెగ్యుమినేసి శాస్త్రీయనామంతో పిలుస్తారు. రహదారుల వెంట, అలంకరణ వృక్షంగా ఇంటి ఆవరణలో నాటుకోవచ్చు.

చల్లటి నీడ జాడ.. మర్రి (బనియన్‌ ట్రీ)..
పైకస్‌ బెంగాలెన్సిస్‌ శాస్త్రీయ నామంతో దీనిని పిలుస్తారు. మోరేసి మహావృక్షం జాతికి చెందినది. గ్రామాల్లో, చౌరస్తాల్లో, రోడ్ల పక్కన, నీడకోసం అనువైన ప్రాంతాల్లో నాటుతారు. పక్షులకు ఆవాసాలుగా, ఆహారంగా ఉంటాయి.

‘రావి’ పళ్లు పక్షులకు ఆహారం
పైకస్‌ రెలిజియోసా శాస్త్రీయ నామంతో పిలుస్తారు. రోడ్డుకు ఇరువైపులా, గుళ్లల్లో నాటుతారు. దీని పండ్లు పక్షులకు ఆహారంగా ఉపయోపడుతాయి. చెట్టు తేనె పట్టుకు ఉపయోగపడుతుంది. ప్యాకింగ్‌ బాక్సులకు, అగ్గి పుల్లల తయారీలో దీన్ని వినియోగిస్తారు.

ఔషధ గుణాల కలిగిన వృక్షమిది.

ప్రకృతికే అందం గుల్‌ మోహర్‌
దీనిని డెలినిక్స్‌ రీజియా అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన పెద్ద వృక్షమిది. విత్తనాల నుంచి వచ్చే జిగురును వస్త్ర, ఆహార పరిశ్రమలు, రంగుల తయారీలోను వాడతారు.
(సోర్స్: నమస్తే తెలంగాణ)