ఈనెల 25 నుంచి నిర్వహించే 6వ విడుత హరితహారంలో జిల్లాలోని 61 పంచాయతీల్లో రెండు కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. కీసరలోని లలిత ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం జిల్లాస్థాయిలో హరితహారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, కలెక్టర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ముందుగా ప్రభుత్వ హయాంలో నిర్వహించే 6వ విడుత హరితహారం పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోని 28 రాష్ర్టాలకంటే తెలంగాణలో హరితహారం అగ్రస్థానంలో ఉందన్నారు. తెలంగాణలో చేపట్టిన హరితహారం దేశానికే ఆదర్శమని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. గతేడాది 1.20 కోట్ల మొక్కలు నాటామని, ఈ సంవత్సరం రెండు కోట్ల మొక్కలు నాటడానికి సంకల్పించామన్నారు. హరితహారంలో భాగంగా జిల్లాలోని ప్రతి గ్రామంలో 61 నర్సరీల్లో మొక్కలు పెంచామన్నారు. ఈసారి నిర్వహించే హరితహారంలో ఉపాధిహామీ కూలీలకు జాబ్‌కార్దులిచ్చి హరితహారంలో పాల్గొనేలా చేయాలన్నారు. జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సంబంధిత అధికారులు ఉద్యమంలా ముందుకొచ్చి హరితహారంలో సైనికుల్లా పనిచేయాలన్నారు. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రెండేండ్లగా మేడ్చల్ జిల్లా హరితహారం అవార్డులు అందుకుంటున్నదని, ఈ ఏడాది కూడా ప్రభుత్వం నుంచి అవార్డు పొందాలన్నారు. ఉపాధి హామీ కూలీల కోసం 15వేల జాబ్ కార్డులందిస్తామన్నారు. అదనపు కలెక్టర్లు విద్యాసాగర్, జాన్‌శ్యాంసన్, డీఎఫ్‌వో సుధాకర్‌రెడ్డి, కీసర ఎంపీపీలు మల్లారపు ఇందిరాలక్ష్మీనారాయణ, ఏనుగు సుదర్శన్‌రెడ్డి, కీసర సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్, కీసర ఎంపీడీవో పద్మావతి, మేడ్చల్, శామీర్‌పేట్, మూడుచింతలపల్లి, ఘట్‌కేసర్‌లకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.
