ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. గత కొన్నిరోజులుగా వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నానికి గత 24 గంటల వ్యవధిలో ఏపీలో 796 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పన్నెండు వేల మార్కును దాటి 12,285కు చేరింది.
కాగా, ఏపీలో నమోదైన మొత్తం కేసులలో 6,648 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 11 మంది కరోనా బాధితులు మృతిచెందడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 157కు చేరింది. ఇక యాక్టివ్ కేసులు, మృతులు పోను మిగతా అందరూ వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొవిడ్-19 నోడల్ ఆఫీసర్ ఈ వివరాలను వెల్లడించారు.