తెలంగాణలో కొత్తగా 1087 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. తొలిసారి పాజిటివ్‌ కేసుల సంఖ్య వెయ్యి మార్కును దాటింది. శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 1,087 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపితే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 13,436కు చేరుకుంది. ఇం దులో 8,265 మంది వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌ పద్ధతుల్లో చికిత్స పొందుతుండగా మరో 4,928 మంది కోలుకున్నారు.

మరోవైపు కరోనా ప్రభావంతో శనివారం ఆరుగురు మరణించారు. దీంతో ఇప్పటివరకు వైరస్‌ బారినపడి మరణించిన వారి సంఖ్య 243కి చేరింది. శనివారం రాష్ట్రంలో 3,923 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 27.7 శాతం కేసులు పాజిటివ్‌గా నమోదు కావడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 79,231 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో 16.95 శాతం మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది.