- కాకతీయ తోరణం.. భారతీయ చిహ్నం
- దేశానికి చేసిన సేవను చాటేలా రూపకల్పన
భూమి పుత్రుడు పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఏడాదిపాటు నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాల కోసం ప్రత్యేక లోగోను రూపొందించింది. పీవీ ఖ్యాతిని తెలియజేసేలా వినూత్నంగా లోగోను తీర్చిదిద్దారు. పీవీ జన్మస్థలం నుంచి రాజకీయంగా దేశానికి ఆయన చేసిన సేవను తెలియజెప్పేలా లోగోను రూపొందించారు. పీవీ జన్మించిన వరంగల్‌కు ప్రతీకగా లోగోలో కాకతీయుల తోరణాన్ని పొందుపరిచారు. ఈ తోరణం మధ్యలో పీవీ చిత్రాన్ని ఉంచారు. ఇక ఆయన ప్రధానిగా దేశానికి చేసిన సేవను తెలియజేసేలా పీవీ చిత్రం వెనుకవైపు జాతీయ పతాకంలోని అశోక చక్రాన్ని పొందుపరిచారు. దీనిపై తెలంగాణ బిడ్డగా, అపర మేధావిగా దేశానికి చేసిన సేవను స్ఫురించేలా ‘తెలంగాణ తేజోమూర్తి.. భారతీయ భవ్యకీర్తి’ అని రాశారు. ఇక లోగో కింది భాగంలో శతజయంతి ఉత్సవాలను ప్రతిబింబించేలా 100 సంఖ్యను, దీనిపై ‘పీవీ మన ఠీవి ‘అని ముద్రించారు. ఆ తర్వాత ‘భరతమాత ముద్దుబిడ్డకు ఘననివాళి’ అంటూ పీవీకి దేశం మొత్తం నివాళి అర్పించిన విధంగా రాశారు.