పాలిసెట్ ప్రవేశ పరీక్ష జూలై 1న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ సమన్వయకర్త రత్నప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష ఖమ్మం నగరంలో మొత్తం 6 సెంటర్లలో జరగనుందన్నారు. ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాలలో మూడు సెంటర్లు ఏర్పాటుచేశామన్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, కవితా మెమోరియల్ డిగ్రీ కళాశాలల్లో ఒక్కో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు చెప్పారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యా హ్నం 1:30 వరకు జరగనుంది. కరోనా నేపథ్యంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అసిస్టెంట్ కో ఆర్డినేటర్‌గా డాక్టర్ రమేశ్ వ్యవహరిస్తున్నారు. నగరంలోని అన్ని సెంటర్లలో కలిపి 2269 మంది విద్యార్థులు ఈ పరీక్షను రాయనున్నారు.
