ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు సరికొత్త విధానాన్ని రూపొందించింది. ఇప్పటిరకు ఆయా ఏజెన్సీల ద్వారా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా ఇకపై ప్రభుత్వమే ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్(ఆప్కాస్) ద్వారా భర్తీ చేయనుంది.
శుక్రవారం తాడిపల్లి క్యాంపు కార్యాలయంలో ఆప్కాస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ మ్యాన్‌పవర్‌ను గుర్తించి వివిధ శాఖలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆప్కాస్‌లో నియమించబడ్డ వారికి ఈపీఎఫ్, ఈఎస్ఐ లాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 47 వేల మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి జరుగనుందని తెలిపారు.
ఉద్యోగాల నియమకాల్లో లంచాల మాట ఉండకూడదని అన్నారు. తాను చేపట్టిన పాదయాత్రలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అనేక సమస్యలను విన్నవించుకున్నారని వివరించారు. ఆప్కాస్ ఏ మాత్రం లాభాపేక్ష లేకుండా పనిచేస్తుందని వెల్లడించారు. ఇప్పటికే ఔట్ సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించబోమని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల ప్రకారం నియమకాలు ఉంటాయని, మహిళలకు 50 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని సీఎం స్పష్టం చేశారు.