వాతావరణ సమతుల్యత కోసమే హరితహారం : అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

వాతావరణ సమతుల్యత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని, పచ్చదనం పెంపుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమనీ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఆర‌వ విడ‌త హరిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా బాస‌ర ట్రిపుల్ ఐటీలో మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ….. రాష్ట్రంలో 24% ఉన్న అటవీ ప్రాంతాన్ని 33% పెంచేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గత ఐదేండ్లలో 182 కోట్లకు పైగా మొక్కలు నాటామని, ఆరవ విడత హరితహారంలో 30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మొక్కలు పెంచడంతో వాతావరణ సమతుల్యత ఏర్పడి సకాలంలో వర్షాలు పడుతాయని చెప్పారు. గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. బాస‌ర‌లో ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో 50 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, 30 వేల మొక్క‌లు నాటారని 20 వేల మొక్క‌లు నాటాల్సి ఉందన్నారు. ముధోల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటిన మంత్రి…. గత ఏడాది తాను నాటిన మొక్కలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, తదితరులు పాల్గొన్నారు.