కాంట్రాక్టర్ నుంచి రూ.1.20 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ
లక్షణమైన ఉద్యోగం..వేలల్లో వేతనం..అయినా చాల్లేదేమో…అత్యాశకు పోయాడు..అక్రమార్జనకు దిగాడు.. అడ్డంగా దొరికిపోయాడు..
మిషన్ కాకతీయ పనుల బిల్లుల మంజూరు కోసం లంచం తీసుకుంటూ ఇరిగేషన్ ఏఈ సోమవారం ఏసీబీ అధికారులకు దొరికాడు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్‌రావు తెలిపిన వివరాలు ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని కోటన్ననగర్ సమీపంలోగల అనంతారం చెరువు పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పథకం కింద రూ.20 లక్షలు మంజూరయ్యాయి. ఆ పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్ రమేశ్, ఫైనల్ బిల్లుల మంజూరు కోసం ఏఈ నవీన్‌ను కలిశారు. క్వాలిటీ కంట్రోల్ తనిఖీ కూడా పూర్తి కావడంతో బిల్లు ఫైనల్ చేసేందుకు కాట్రాక్టర్ నుంచి ఏఈ నవీన్ రూ.1.20 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. ఏఈ అడిగిన డబ్బు ఇచ్చేందుకు ఇష్టపడని కాంట్రాక్టర్ రమేశ్ ఏసీబీని ఆశ్రయించారు. మండలంలోని సుభాశ్‌నగర్‌లో ఏఈకి చెందిన ప్రైవేటు కార్యాలయంలో రూ.1.20 లక్షల నగదును ఏఈ నవీన్‌కు కాంట్రాక్టర్ ఇచ్చారు. సరిగ్గా అదే సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏఈ నవీన్ వద్ద ఉన్న ఆ నగదును స్వాధీనపర్చుకున్నారు. కాంట్రాక్టర్ ఇచ్చిన ఆ కరెన్సీ నోట్లకు ఏసీబీ అధికారులు ముందుగానే రసాయనం పూశారు. ఏఈ నుంచి స్వాధీనపర్చుకున్న ఆ నోట్లకు రసాయన పరీక్షలు నిర్వహించి, లంచం డబ్బుగా నిర్ధారించారు. ఆ తరువాత ఏఈ నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఏఈ ప్రైవేటు కార్యాలయం నుంచి ఇరిగేషన్ డివిజన్ కార్యాలయానికి ఏసీబీ అధికారులు వెళ్లారు. కాంట్రాక్టర్ చేసిన పనులు, బిల్లుల చెల్లింపు ప్రక్రియకు సంబంధించిన వివరాలను డీఈ భాగ్యరాజ్ రాథోడ్ నుంచి తెలుసుకున్నారు.
చేసిన పనులకు బిల్లు సిద్ధం చేసేందుకు ఏఈ నవీన్ రూ.1.20 లక్షలు లంచం అడిగినట్లుగా ఏసీబీకి కాంట్రాక్టర్ రమేశ్ సమాచారం ఇచ్చారు. లంచం డబ్బు తీసుకున్న ఏఈ నవీన్‌ను పట్టుకున్నాం. సమగ్ర విచారణ కోసం అదుపులోకి తీసుకున్నాం. విచారణ అనతరం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం” అని విలేకరులకు ఏసీబీ డీఎస్పీ మధుసూదన్‌రావు వివరించారు. ఏసీబీ అధికారులు రమణమూర్తి, రవీందర్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.