చెట్లు విరివిగా ఉంటేనే విస్తారంగా వర్షాలు: అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించి, సంరక్షించాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం బెల్లంప‌ల్లి ఫారెస్ట్ డివిజ‌న్ క్రిష్ణ‌ప‌ల్లి రేంజ్ లో హ‌రిత‌హారంలో భాగంగా 25 ఎకారాల స్థ‌లంలో ఒకే రోజు 11,110 మొక్కలు నాటే కార్య‌క్రమాన్ని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించి, మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ…అడవుల పెంపకం మొత్తం వాతావరణంలోనే మార్పు తెస్తుందని, వర్షాలు బాగా కురవడానికి దోహద పడుతుందన్నారు. హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా మొక్క‌లు పెంప‌కానికి ప్ర‌భుత్వం అధిక ప్రాధ‌న్య‌త‌నిస్తుంద‌ని తెలిపారు. ఏ ప్రాంతమైనా సుభిక్షంగా ఉండాలంటే ఆ ప్రాంతం మొత్తం భూభాగంలో 33 శాతం అడవులు ఉండాల‌ని, అందుకే సీయం కేసీఆర్ 24% ఉన్న అట‌వీ ప్రాంతాన్ని 33% పెంచాల‌నే సంక‌ల్పంతో అడ‌వుల పున‌రుజ్జీవ‌నం, ప‌చ్చ‌ద‌నానికి పెద్ద‌పీట వేస్తున్నార‌ని వెల్ల‌డించారు. పరిసరాలు పచ్చదనంతో ఉండి చెట్లు విరివిగా ఉంటేనే వర్షాలు విస్తారంగా పడతాయని తెలిపారు. చెట్లు ఉన్నచోటనే వర్షాలుబాగా పడుతున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. నాటిన మొక్క‌ల్లో 85% మొక్క‌ల‌ను బ‌తికించుకునేలా స‌ర్పంచ్ లు, పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. అనంత‌రం బెల్లంప‌ల్లి ఏఆర్ పోలీస్ హెడ్ క్వార్ట‌ర్స్ లో హ‌రిత‌హార కార్యక్ర‌మంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. ఈ కార్యక్ర‌మంలో ఎమ్యెల్యే దుర్గం చిన్న‌య్య‌, ఎమ్మెల్సీ పురాణం స‌తీష్, క‌లెక్ట‌ర్ భారతీ హోళికేరి, డీఎఫ్ వో లావ‌ణ్య‌, త‌దిత‌రులు పాల్గొన్నారు