- పరవాడ, నంద్యాల గ్యాస్ లీక్ ఘటనలపై సీఎస్ కు ఎన్జీటీ ఆదేశం
పరవాడ, నంద్యాల పరిశ్రమల్లో ఆన్ సైట్, ఆఫ్ సైట్ అత్యవసర ప్రణాళికల ఆమలు, మాక్ డ్రిల్ నిర్వహణకు సంబంధించి పర్యవేక్షణలో విఫలమైన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. జూన్ 30న పరవాడ సాయినార్ ఫార్మా, జూన్ 26న నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ల్లో గ్యాస్ లీకై మొత్తం ముగ్గురు మృతిచెంది, ఏడుగురు క్షతగాత్రులైన ఘటనలను ఎన్జీటీ సుమోటోగా స్వీకరించింది. జస్టీస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం ఘటనపై ఆన్ లైన్ ద్వారా సోమవారం విచారించింది. లిఖిత పూర్వక ఉత్వర్వులను మంగళవారం విడుదల చేసింది. పరవాడ సాయినార్ ఫార్మా ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్ అఫిడవిట్ దాఖలు చేశారని… నంద్యాల ఘటనపై ఎటువంటి స్పందన లేదని పేర్కొంది. పరవాడ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.35 లక్షల చొప్పున పరిహారం చెల్లించినా, క్షతగాత్రులకు ఇవ్వలేదని తెలిపింది. ఒక్కో క్షతగాత్రునికి రూ.5 లక్షల మధ్యంతర పరిహారం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలంది. నంద్యాల ఘటనలోనూ మృతుని కుటుంబ సభ్యులకు రూ.15 లక్షలు, ఒక్కో క్షతగాత్రునికి రూ.5 లక్షల చొప్పున మధ్యంతర పరిహారం కర్నూలు జిల్లా కలెక్టర్ వద్ద రెండు వారాల్లోపు డిపాజిట్ చేయాలని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీని ఆదేశించింది. ఆ మొత్తాన్ని కలెక్టర్లు బాధితుల ఖాతాల్లో జమ చేయాలని సూచించింది. రెండు ఘటనల్లోనూ పూర్తి పరిహారం చెల్లింపు, పర్యావరణ పునరుద్ధరణ, ముందస్తు జాగ్రత్తల రూప కల్పన.. సిపార్సులకు ఓ సంయుక్త కమిటీని నియమించింది. కమిటీలో సభ్యులుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సీహెచ్ వీ రామచంద్రమూర్తి, కెమికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ పుటిపాటి కంగ్, విశాఖ పట్నం కలెక్టర్, (నంద్యాల కేసులో కర్నూలు జిల్లా కలెక్టర్), కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని సూచించింది కేసు తదుపరి విచారణను నవంబరు మూడుకు వాయిదా వేసింది. - కంపెనీ మూసివేతకు సూచన…
విశాఖపట్నం కలెక్టర్ సమర్పించిన అపిడవిట్ ప్రకారం సాయినార్ ఫార్మా రక్షణ చర్యలు పాటించడంలో విఫలమైనందున పర్యావరణం, ప్రజారోగ్యం దృష్ట్యా పరిశ్రమను మూసివేయాలని ధర్మాసనం పీసీబీకి సూచించింది.
